ePaper
Friday, September 4, 2026

ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను ప్రపంచ స్థాయిలో పోటీపడేలా తీర్చిదిద్దాలి-జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్

చీకటి వెలుగు నల్లగొండ. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు గుణాత్మక విద్య అందించి, వారిని ప్రపంచ స్థాయిలో పోటీపడేలా తీర్చిదిద్దాలని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయ ఉదయాదిత్య భవన్‌లో విద్యాశాఖ అధికారులతో సమీక్షషించారు. కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమైనందున ప్రతి అధికారి, ఉపాధ్యాయుడు స్పష్టమైన డ్యూటీ ప్లాన్‌తో పనిచేయాలని కలెక్టర్ అన్నారు.జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెంచాలని, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలని అన్నారు.

ప్రైవేట్ పాఠశాలలకు వెళ్లే విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించేలా తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని, ప్రైవేట్ పాఠశాలల నుంచి వచ్చే విద్యార్థులను సులభంగా చేర్చుకోవాలని సూచించారు. విద్యార్థుల చేరికల విషయంలో ఎవరైనా ఇబ్బందులకు గురిచేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.అంగన్‌వాడీ కేంద్రాల్లో ఐదేళ్లు పూర్తి చేసుకున్న పిల్లల వివరాలను సేకరించి సమీప ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని ఆదేశించారు. విద్యార్థులకు అవసరమైన పాఠ్యపుస్తకాలు, యూనిఫాంలు అందేలా చూడాలని తెలిపారు. విద్యార్థులకు ఆధార్ కార్డులు, జనన ధ్రువపత్రాలు, నివాస, కుల ధ్రువపత్రాలు అవసరమైన చోట తహసీల్దార్ల సహకారంతో ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు. తల్లిదండ్రుల సమావేశాల్లో ఆధార్ నమోదు, ఇతర ధ్రువపత్రాల అంశాలపై అవగాహన కల్పించి వారి అభిప్రాయాలను తీసుకోవాలని పేర్కొన్నారు.
ఎఫ్‌ఆర్‌ఎస్ ప్రక్రియపై ఉపాధ్యాయులు ప్రత్యేక బాధ్యత తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు. విద్యార్థుల ఎఫ్‌ఆర్‌ఎస్ నమోదు, యూనిఫాం ,స్కావెంజర్ తదితర ప్రక్రియలను నూరు శాతం పూర్తి చేయాలని ఆదేశించారు.
ఎఫ్‌ఆర్‌ఎస్ నమోదు చేసిన తర్వాత విద్యార్థులను పాఠశాల వెలుపలికి పంపకుండా, వారి భద్రతకు ఉపాధ్యాయులే పూర్తి బాధ్యత వహించాలని స్పష్టం చేశారు.అన్ని పాఠశాలలకు పాఠ్యపుస్తకాలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అందించాలని తెలిపారు. ప్రతి ప్రాథమిక పాఠశాలలో కనీసం 25 మంది విద్యార్థులు ఉండేలా ఎన్రోల్మెంట్ పెంచాలని ఆదేశించారు.
ప్రతి ప్రీ-ప్రైమరీ పాఠశాలలో ఎన్రోల్మెంట్ పెంచేందుకు ఉపాధ్యాయులు చురుకుగా పనిచేయలన్నారు. చిన్నారులకు ప్రాథమిక దశ నుంచే సమానమైన, నాణ్యమైన విద్య అందించి వారి ఆలోచనా సామర్థ్యం, పెరిగేలా చూడాలని అన్నారు. ప్రీ-ప్రైమరీ పాఠశాలలను సామాజిక మాధ్యమాల ద్వారా విస్తృతంగా ప్రచారం చేయాలని, ఇన్‌స్టాగ్రామ్ తదితర మాధ్యమాలను వినియోగించి తల్లిదండ్రుల్లో విశ్వాసం పెంచాలని సూచించారు.
మధ్యాహ్న భోజన పథకం అమలుపై కూడా కలెక్టర్ ప్రత్యేకంగా సమీక్షించారు. విద్యార్థులకు ఉదయం అల్పాహారం, మధ్యాహ్న భోజనం నాణ్యతగా అందించాలని, పాఠశాలల్లో ఆరోగ్య పరీక్షలు నిర్వహించి యాప్‌లో వివరాలను నమోదు చేయాలని తెలిపారు. ప్రతి మూడు నెలలకు ఒకసారి విద్యార్థుల ఆరోగ్య పరీక్షలు తప్పనిసరిగా నిర్వహించాలని, గుడ్డు, బియ్యం, రాగిజావ వంటి పోషకాహారం క్రమం తప్పకుండా అందేలా ప్రధానోపాధ్యాయులు పర్యవేక్షించాలని ఆదేశించారు.
వంటశాలలు, భోజన పాత్రలు, నిల్వ గదులు పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని, కొత్త డిజైన్‌తో వంటశాలలను నీట్‌గా నిర్వహించాలని సూచించారు. పాత సామగ్రిని అవసరానికి అనుగుణంగా వినియోగించుకోవాలని, వంట సామగ్రి సక్రమంగా ఉండేలా చూడాలని తెలిపారు.
ప్రతి విద్యార్థి చదవడం, రాయడం, మాట్లాడడం వంటి ప్రాథమిక నైపుణ్యాలను సాధించేలా సర్వే ఆధారంగా ప్రత్యేక ప్రణాళిక రూపొందించాలన్నారు తెలుగు, హిందీ, ఇంగ్లీషు భాషల్లో విద్యార్థులు చదవగలిగేలా, రాయగలిగేలా, మాట్లాడగలిగేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని అన్నారు. విద్యార్థుల్లో ప్రతిభను గుర్తించి అభివృద్ధి చేయాలని, ఒలింపియాడ్‌లు, పోటీ పరీక్షలు, ఇతర కాంపిటీటివ్ పరీక్షల్లో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు పాల్గొని విజయం సాధించేలా శిక్షణ ఇవ్వాలని తెలిపారు.
విద్యార్థుల అభివృద్ధికి అవసరమైన బడ్జెట్ విషయంలో అధికారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, పిల్లల కోసం అవసరమైన నిధులు అందిస్తామని కలెక్టర్ తెలిపారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు అన్ని రంగాల్లో ప్రైవేట్ విద్యార్థులతో పోటీపడి గెలిచేలా ప్రతి ఉపాధ్యాయుడు బాధ్యతతో పనిచేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో స్థానిక సంస్థల ఇంచార్జ్ అదనపు కలెక్టర్ ప్రేమ్ కరణ్ రెడ్డి, జిల్లా విద్యాశాఖ అధికారి సుశీందర్ రావు ,

ఎంఈఓ లు ,ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు .


Discover more from cheekativelugu.com

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments

error: Content is protected !!