ePaper
Saturday, May 30, 2026

సబ్సిడీపై అందిస్తున్న పచ్చిరొట్ట ఎరువులను రైతులు సద్వినియోగం చేసుకోవాలి: కలెక్టర్ బి. చంద్రశేఖర్

రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీపై అందజేస్తున్న పచ్చిరొట్ట ఎరువులను రైతులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ కోరారు. శుక్రవారం నల్గొండ జిల్లా కేంద్రంలోని క్లాక్ టవర్ సమీపంలో ఉన్న నాగార్జున జిల్లా సహకార మార్కెటింగ్ సంఘం లిమిటెడ్ ఆవరణలో ఏర్పాటు చేసిన పచ్చిరొట్ట ఎరువుల విత్తనాల విక్రయ కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం పచ్చిరొట్ట ఎరువుల విత్తనాలను రైతులకు సబ్సిడీపై అందజేస్తోందన్నారు. జీలుగ విత్తనాల ధర కిలోకు రూ.163.50 ఉండగా, ప్రభుత్వం రూ.81.75 సబ్సిడీ అందిస్తోందని తెలిపారు. దీంతో రైతులు కిలోకు రూ.81.75 మాత్రమే చెల్లించాల్సి ఉంటుందని, 30 కిలోల బ్యాగును రూ.2,452.50కు కొనుగోలు చేయవచ్చని వివరించారు.

అలాగే జనుము విత్తనాల ధర కిలోకు రూ.155.60 ఉండగా, ప్రభుత్వం రూ.77.75 సబ్సిడీ ఇస్తోందన్నారు. రైతులు మిగిలిన రూ.77.75 చెల్లించి కొనుగోలు చేయవచ్చని, 40 కిలోల జనుము విత్తనాల బ్యాగు ధర రూ.3,110గా ఉంటుందని పేర్కొన్నారు.

పచ్చిరొట్ట ఎరువుల వినియోగం వల్ల నేల సాంద్రత, సారవంతత పెరగడంతో పాటు భూసార శక్తి మెరుగుపడుతుందని, తద్వారా పంట దిగుబడులు అధికమవుతాయని కలెక్టర్ తెలిపారు. అందువల్ల రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

ప్రభుత్వం ద్వారా జిల్లాకు 3,500 క్వింటాళ్ల జీలుగ విత్తనాలు, 500 క్వింటాళ్ల జనుము విత్తనాలు కేటాయించబడినట్లు తెలిపారు. వీటిని జిల్లాలోని వివిధ మండలాలకు పంపిణీ చేసినట్లు వెల్లడించారు.

ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ గుమ్మల మోహన్ రెడ్డి, లక్ష్మయ్య, ఇతర ప్రజాప్రతినిధులు, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శ్రవణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.


Discover more from cheekativelugu.com

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments

error: Content is protected !!