మార్కెట్ కమిటీ నిధులతో గ్రామీణ ప్రాంతాలకు లింక్ రోడ్లు: చైర్మన్ జూకూరి రమేష్
నల్లగొండ: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతు సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శనివారం నల్గొండ వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గ సాధారణ సమావేశం మార్కెట్ కమిటీ చైర్మన్ జూకూరి రమేష్ అధ్యక్షతన నిర్వహించారు.
ఈ సమావేశంలో పాల్గొన్న మేయర్ మాట్లాడుతూ, రైతులు పండించిన ధాన్యాన్ని ఐకేపీ కేంద్రాల ద్వారా కొనుగోలు చేసే ప్రక్రియలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మార్కెట్ కమిటీలు విశేషంగా కృషి చేశాయని తెలిపారు. రైతుల సమస్యలను ఎప్పటికప్పుడు గుర్తించి పరిష్కరించాలని పాలకవర్గ సభ్యులకు సూచించారు. నల్గొండ మార్కెట్ కమిటీ అభివృద్ధికి ఎల్లవేళలా సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.
మార్కెట్ కమిటీ చైర్మన్ జూకూరి రమేష్ మాట్లాడుతూ, మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సహకారంతో నల్గొండ మార్కెట్ కమిటీని మరింత అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తున్నామని తెలిపారు. ఖరీఫ్, రబీ సీజన్లలో రైతులు పండించిన పంటలను కొనుగోలు చేస్తూ వారికి ఇబ్బందులు లేకుండా సేవలు అందిస్తున్నామని చెప్పారు. ప్రస్తుతం ధాన్యం కొనుగోళ్లు ముగింపు దశకు చేరుకున్నాయని పేర్కొన్నారు.
నల్లగొండ వ్యవసాయ మార్కెట్ పరిధిలోని కనగల్ సబ్ మార్కెట్ యార్డులో రూ.1.25 కోట్ల వ్యయంతో పలు అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. మార్కెట్ కమిటీ నిధులతో గ్రామీణ, మండల ప్రాంతాలకు లింక్ రోడ్ల నిర్మాణం చేపడుతున్నామని, ఇందుకు సంబంధించిన తీర్మానాలు చేసి ప్రతిపాదనలు పంపినట్లు వెల్లడించారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వం మార్కెట్ కమిటీ నిధులతో చేపట్టే అభివృద్ధి పనులను నిలిపివేసిందని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తిరిగి అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభమయ్యాయని తెలిపారు. తొలిసారిగా మార్కెట్ కమిటీ పాలకవర్గ సమావేశానికి మేయర్ హాజరు కావడం పట్ల కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ సమావేశంలో మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ జూలకంటి వెంకట్ రెడ్డి, మార్కెట్ కమిటీ కార్యదర్శి శ్రీనాథ్ రాజు, ప్రత్యేక శ్రేణి కార్యదర్శి రమేష్, డైరెక్టర్లు వాడల జానయ్య, గంటకంపు సైదులు, ఆంజనేయులు, సుంకిరెడ్డి సైదిరెడ్డి, చిట్టిపోలు నాగయ్య, కుక్కడపు శ్రీను, మార్కెట్ కమిటీ సిబ్బంది పాల్గొన్నారు.
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments