ePaper
Tuesday, March 31, 2026

రహదారి భద్రతపై కట్టుదిట్ట చర్యలు

నల్గొండ జిల్లాలో రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో రహదారి భద్రత చర్యలను కట్టుదిట్టంగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ సూచించారు.

సోమవారం కలెక్టర్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్తో కలిసి నిర్వహించిన జిల్లా స్థాయి రహదారి భద్రత సమావేశంలో ఆయన పాల్గొన్నారు.

ఈ సందర్భంగా జిల్లాలోని రహదారులు, బ్లాక్ స్పాట్లు, ప్రమాదాలు, మరణాల వివరాలను పోలీసు శాఖ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సమీక్షించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ రహదారి భద్రతపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని తెలిపారు.

“ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక”లో భాగంగా చేపడుతున్న “సురక్షితంగా చేరుకోండి” కార్యక్రమాన్ని ఏప్రిల్ 2న గ్రామ, వార్డు సభల ద్వారా ప్రజలకు చేరవేయాలని సూచించారు. అలాగే లైసెన్స్, రిజిస్ట్రేషన్ సేవలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని రవాణా శాఖ అధికారులను ఆదేశించారు.

నల్గొండ జిల్లాలో జాతీయ రహదారి విస్తీర్ణం ఎక్కువగా ఉండటంతో, హైదరాబాద్–విజయవాడ హైవేపై ట్రామా కేర్ సెంటర్ ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే 20 నిమిషాల్లో పోలీసులతో పాటు సంబంధిత శాఖలు చేరుకునే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు.

బ్లాక్ స్పాట్ల వద్ద ప్రమాదాలు తగ్గించేందుకు ఆర్ అండ్ బి, నేషనల్ హైవే అథారిటీలు ఏప్రిల్ మొదటి వారంలోపు చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ మాట్లాడుతూ, గత 18 నెలల్లో బ్లాక్ స్పాట్ల సంఖ్యను 58 నుంచి 38కి తగ్గించామని, మరణాల సంఖ్యను 7 శాతం తగ్గించగలిగామని తెలిపారు.

మైనర్ యువకులు వాహనాలు నడపడం వల్ల ప్రమాదాలు పెరుగుతున్నాయని, పాఠశాల స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.

ఈ సందర్భంగా రహదారి భద్రతలో విశేషంగా పనిచేసిన అధికారులకు కలెక్టర్, ఎస్పీ అభినందన పత్రాలు అందజేశారు.

ఈ సమావేశంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.


Discover more from cheekativelugu.com

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments

error: Content is protected !!