ఆరోగ్యం బాగుంటే అన్నీ బాగుంటాయి: మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి
ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా నల్గొండ జిల్లాలో 5కే రన్‌ను ఘనంగా ప్రారంభించారు. సోమవారం నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఎన్జీ కళాశాల మైదానం నుంచి క్లాక్ టవర్ వరకు నిర్వహించిన 5కే రన్‌ను నగర మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు.

ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ ఆరోగ్యం బాగుంటే అన్నీ ఉన్నట్లేనని, ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని కోరారు. రోజూ ఇంట్లోనే ఉండకుండా బయటకు వచ్చి వాకింగ్ లేదా వ్యాయామం చేస్తే ఆరోగ్యం మెరుగుపడుతుందని తెలిపారు. ప్రజలకు ప్రభుత్వ పథకాలను చేరవేసి వారు వాటి లబ్ధిని పొందేలా చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం “ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక” పేరుతో 99 రోజుల కార్యాచరణ ప్రణాళికను అమలు చేస్తున్నదని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.
జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రజల్లో ఆరోగ్యంపై అవగాహన కల్పించడం మరియు ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేయడం లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించామని తెలిపారు. ఆరోగ్యానికి మించిన ఆస్తి మరొకటి లేదని, ఆరోగ్యం బాగుంటేనే అన్ని పనులు సజావుగా సాగుతాయని అన్నారు. ప్రస్తుతం చాలామంది లైఫ్‌స్టైల్ సమస్యలతో బాధపడుతున్నారని, వాటిని దూరం చేసుకోవడానికి ఫిట్‌నెస్ ఎంతో అవసరమని చెప్పారు. ప్రతి ఒక్కరూ తమ దైనందిన జీవితంలో వ్యాయామాన్ని భాగం చేసుకోవాలని సూచించారు.
5కే రన్ ఎన్జీ కాలేజీ నుంచి క్లాక్ టవర్ వరకు కొనసాగింది. అనంతరం మానవహారం నిర్వహించి, రన్‌లో పాల్గొన్న వారితో జిల్లా కలెక్టర్ ప్రతిజ్ఞ చేయించారు.
ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల ఇన్‌చార్జ్ అదనపు కలెక్టర్ వై. అశోక్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ బి. శరత్ చంద్ర, మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస రెడ్డి, కార్పొరేటర్లు పెరిక స్వాతి, మామిడి కార్తీక్, డాక్టర్ పుల్లారావు, ప్రజాప్రతినిధులు, అధికారులు, యువత, మున్సిపల్ కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments