– నల్లగొండ జిల్లా బీసీ జేఏసీ చైర్మన్ మున్నాసు ప్రసన్నకుమార్
నల్లగొండ:
బీసీలకు జనాభా నిష్పత్తి ప్రకారం రిజర్వేషన్లు కల్పించకపోతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించకూడదని జిల్లా బీసీ జేఏసీ చైర్మన్ మున్నాసు ప్రసన్నకుమార్ డిమాండ్ చేశారు.
నల్లగొండలో బీసీ జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించిన భారీ నిరసన ర్యాలీలో ఆయన మాట్లాడుతూ —
“రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అన్ని రాజకీయ పార్టీలను ఢిల్లీకి తీసుకువెళ్లి, రేపు జరగబోయే పార్లమెంట్ సమావేశంలో బీసీ బిల్లును ప్రవేశపెట్టి తొమ్మిదవ షెడ్యూల్‌లో చేర్చాలి. రాజ్యాంగ సవరణ ద్వారా చట్టసభల్లో, స్థానిక సంస్థల్లో బీసీలకు వారి జనాభా నిష్పత్తి మేరకు రిజర్వేషన్లు కల్పించాలి” అని తెలిపారు.
“బీసీల హక్కులు సాధించేంత వరకు ఈ ఉద్యమం కొనసాగుతుంది. ఇది ప్రజాస్వామ్య బద్ధమైన, బీసీల ఆత్మగౌరవం కోసం చేసే పోరాటం” అని ఆయన స్పష్టం చేశారు.
హైకోర్టు ఎన్నికల ప్రక్రియను ఆపివేయడం దురదృష్టకరమని, ఎన్నికల నోటిఫికేషన్ జారీ అయిన తరువాత ఎన్నికలను వాయిదా వేయడం సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధమని విమర్శించారు. ఈ నిర్ణయం రాష్ట్రంలోని 56 శాతం బీసీ ప్రజల హక్కులకు విఘాతం కలిగించేదిగా ఉందని, బీసీల ఆత్మగౌరవం దెబ్బతిందని ఆవేదన వ్యక్తం చేశారు.
రాజ్యాంగంలోని 243(D)(6) ఆర్టికల్ ప్రకారం రాష్ట్రాలకు రిజర్వేషన్లు పెంచుకునే అధికారం ఉందని, అయినప్పటికీ రిజర్వేషన్లను 50 శాతానికి పరిమితం చేయడం అన్యాయమని మండిపడ్డారు.
“బీసీలు ఎంతమంది ఉన్నారో, వారికి అంత రిజర్వేషన్లు ఇవ్వాలి. బీసీ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టే వరకు మేము వెనక్కి తగ్గం” అని ఆయన హెచ్చరించారు.
అన్ని రాజకీయ పార్టీలు బీసీలకు మద్దతుగా ఏకతాటిపైకి రావాలని పిలుపునిచ్చారు. “42 శాతం రిజర్వేషన్లు అమలు చేసిన తరువాతే స్థానిక సంస్థల ఎన్నికలు జరగాలి” అని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు అయితగోని జనార్ధన్ గౌడ్, బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు చిలకరాజు సతీష్, పట్టణ అధ్యక్షుడు పుట్ట వెంకన్న గౌడ్, యువజన సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు చెన్నూరి భరద్వాజ్ యాదవ్, బీసీ విద్యార్థి నాయకులు కొంపల్లి రామన్న గౌడ్, పృధ్విరాజ్, మహేష్ కుమార్, మణికంఠ, రాజేష్, రవి, తరుణ్, మల్లేష్, రామ్ చరణ్, సాయి తేజ, శంకర్, యాదగిరి, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments