కేటగిరీ–3లో డివిజన్ 16కు రెండో స్థానం.. రూ.20 లక్షల నగదు బహుమతి
చీకటి వెలుగు నల్లగొండ.
స్వచ్ఛ వాయు నిర్వహణలో నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ జాతీయ స్థాయిలో సత్తా చాటింది. కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జాతీయ స్వచ్ఛ వాయు కార్యక్రమం (ఎన్‌సీఏపీ)లో భాగంగా నిర్వహించిన వార్డు స్థాయి స్వచ్ఛ వాయు సర్వేక్షణ–2026లో నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్‌లోని డివిజన్–16 కేటగిరీ–3లో దేశవ్యాప్తంగా రెండో స్థానాన్ని దక్కించుకుంది. దేశంలోని 130 పట్టణ స్థానిక సంస్థలు ఈ సర్వేక్షణలో పాల్గొన్నాయి. రెండో స్థానం సాధించినందుకు రూ.20 లక్షల నగదు బహుమతితో కూడిన జాతీయ అవార్డును నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్‌రెడ్డి, మున్సిపల్ కమిషనర్ బి.వంశీకృష్ణ, డివిజన్–16 కార్పొరేటర్ పెరిక స్వాతి స్వీకరించారు.
ఢిల్లీలో ఘనంగా అవార్డు ప్రదానం: స్వచ్ఛ వాయు దివస్–2026 సందర్భంగా సోమవారం న్యూఢిల్లీలోని ఇందిరా పర్యావరణ భవన్‌లో గంగా ఆడిటోరియంలో అవార్డుల ప్రదానోత్సవం నిర్వహించారు. కార్యక్రమంలో జాతీయ హరిత ట్రైబ్యునల్ చైర్‌పర్సన్ ప్రకాశ్ శ్రీవాస్తవ, వాయు నాణ్యత నిర్వహణ కమిషన్ చైర్‌పర్సన్ రాజేష్ వర్మ, కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ కార్యదర్శి తన్మయ్ కుమార్, అటవీశాఖ డైరెక్టర్ జనరల్, ప్రత్యేక కార్యదర్శి సుశీల్ కుమార్ అవస్థి, అదనపు కార్యదర్శులు ఆశుతోష్ అగ్నిహోత్రి, అమందీప్ గార్గ్ తదితరులు పాల్గొన్నారు.
పలు చర్యలకు గుర్తింపు: గాలి నాణ్యత మెరుగుదల, రహదారులపై దుమ్ము నియంత్రణ, ఘన వ్యర్థాల నిర్వహణ, పచ్చదనం పెంపు, ప్రజల్లో అవగాహన వంటి అంశాలను సర్వేక్షణలో ప్రధానంగా పరిగణించారు. నల్గొండ నగరంలో జంక్షన్ల అభివృద్ధి, విద్యుత్ వాహనాల ఛార్జింగ్ కేంద్రాల ఏర్పాటు, విస్తృతంగా మొక్కల పెంపకం, రహదారి మార్గాల్లో పచ్చదనం అభివృద్ధి, చెత్త పేరుకుపోయే ప్రాంతాల రూపాంతరం, వ్యర్థాల నుంచి పునర్వినియోగ పదార్థాలను వేరు చేసే కేంద్రం ఏర్పాటు వంటి చర్యలు చేపట్టారు. వీటితోపాటు పరిశుభ్రత, వ్యర్థాల సమర్థ నిర్వహణ, పర్యావరణ పరిరక్షణకు తీసుకున్న చర్యలు డివిజన్–16కు జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చాయి.
నంబర్–1గా తీర్చిదిద్దుతాం: మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ.. జాతీయ స్థాయి అవార్డు నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్‌కు గర్వకారణమన్నారు. నల్గొండ ఎమ్మెల్యే, రోడ్లు–భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సహకారంతో నగర అభివృద్ధికి మరింత వేగం తీసుకువస్తామని తెలిపారు. అన్ని డివిజన్లలో మెరుగైన మౌలిక వసతులు, ఆధునిక పట్టణ సౌకర్యాలు కల్పించి నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్‌ను తెలంగాణలోనే ప్రథమ స్థానంలో నిలిపేందుకు కృషి చేస్తామని చెప్పారు.
పరిశుభ్రమైన నగరమే లక్ష్యం: కమిషనర్ బి.వంశీకృష్ణ మాట్లాడుతూ.. మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సహకారం, మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్‌రెడ్డి మార్గదర్శకత్వంలో నగరానికి మెరుగైన మౌలిక వసతులు, ఆధునిక పౌర సౌకర్యాలు అందించేందుకు చర్యలు కొనసాగిస్తామని తెలిపారు. పరిశుభ్రమైన పరిసరాలు, పచ్చదనం, సమర్థవంతమైన వ్యర్థాల నిర్వహణ వ్యవస్థను మరింత బలోపేతం చేస్తామని, స్వచ్ఛమైన, ఆరోగ్యకరమైన నల్గొండ నిర్మాణానికి సమన్వయంతో పనిచేస్తామని పేర్కొన్నారు.
కేటగిరీ–3లో జాతీయ స్థాయిలో రెండో స్థానం, రూ.20 లక్షల నగదు బహుమతి సాధించడం నల్గొండ నగర అభివృద్ధి ప్రస్థానంలో మరో కీలక మైలురాయిగా నిలిచిందని అధికారులు తెలిపారు.
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments