చీకటి వెలుగు నల్లగొండ
తెలంగాణలో ఆటో డ్రైవర్లు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని తెలంగాణ ఆటో మోటార్స్ జేఏసీ డిమాండ్ చేసింది. హామీల అమలు, ఉపాధి పరిరక్షణ, సంక్షేమ బోర్డు ఏర్పాటు తదితర సమస్యలపై ప్రభుత్వం స్పందించకపోతే ఈ నెల 23వ తేదీ అర్ధరాత్రి నుంచి నిరవధిక సమ్మె చేపట్టనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు జేఏసీ నాయకులు నల్గొండ జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలులోకి రావడంతో ఆటో డ్రైవర్ల ఆదాయంపై తీవ్ర ప్రభావం పడిందని వారు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఆటో డ్రైవర్ల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి, ఏటా రూ.12 వేల ఆర్థిక సాయం అందిస్తామని గతంలో ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేయలేదని ఆరోపించారు. ఉచిత బస్సు పథకం కారణంగా ఉపాధి కోల్పోయిన డ్రైవర్లకు నెలకు రూ.15 వేల నష్టపరిహార భృతి ఇవ్వాలని కోరారు. ఆర్టీసీ ఆధ్వర్యంలో సంస్థలతో కలిసి ‘మొదటి మైలు–చివరి మైలు’ పేరుతో విద్యుత్ ఆటోలను ప్రవేశపెట్టే చర్యలను నిలిపివేయాలని జేఏసీ డిమాండ్ చేసింది. ఇప్పటికే ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న స్థానిక ఆటో డ్రైవర్ల ఉపాధిని దెబ్బతీసే నిర్ణయాలు తీసుకోవద్దని స్పష్టం చేసింది. రాపిడో, ఓలా, ఉబెర్ వంటి సంస్థలు వసూలు చేస్తున్న అధిక కమీషన్లను నియంత్రించాలని, ప్రయాణికుల నుంచి వసూలు చేసే చార్జీలు, డ్రైవర్లకు లభించే ఆదాయాన్ని సమీక్షించి కొత్త రేట్లు నిర్ణయించాలని కోరారు. ప్రైవేటు ద్విచక్ర వాహనాలను అద్దె రవాణా సేవలుగా వినియోగించే విధానాన్ని నియంత్రించాలని విజ్ఞప్తి చేశారు. సీబీజీ ఇంధనం వినియోగంతో ఆటోలు, క్యాబ్‌లు, లారీలు, డీసీఎం వాహనాల్లో మైలేజీ తగ్గడం, ఇంజిన్‌పై అదనపు భారం పడటం, తరచూ మరమ్మతులు చేయాల్సి రావడం వంటి సమస్యలు ఎదురవుతున్నాయని డ్రైవర్లు చెబుతున్నారని నాయకులు తెలిపారు. ఈ అంశంపై సాంకేతిక నిపుణులతో సమగ్ర పరిశీలన జరిపించాలని కోరారు. సీబీజీ వల్ల వాహనాలకు నష్టం జరుగుతున్నట్లు నిర్ధారణ అయితే దాని స్థానంలో సీఎన్జీని అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. సీఎన్జీ వాహనాలకు తగినంత ఇంధనం అందుబాటులో లేని పరిస్థితుల్లో ప్రభుత్వం ప్రత్యామ్నాయ రవాణా సదుపాయం కల్పించి డ్రైవర్లకు నష్టం కలగకుండా చూడాలని కోరారు. ప్రభుత్వం వెంటనే స్పందించి సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలని, లేకుంటే నిరవధిక సమ్మెను కొనసాగిస్తామని తెలంగాణ ఆటో మోటార్స్ జేఏసీ నల్గొండ జిల్లా అధ్యక్షుడు కలగొని యాదయ్య గౌడ్ తెలిపారు. కార్యక్రమంలో బీఆర్టీయూ–టీఏటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాజరల్లి మీర్జా, జిల్లా ఉపాధ్యక్షులు ఈదుల వెంకన్న, గొలుసు శంకర్ బాబా, డీవీకే రోడ్ ఆటో యూనియన్ అధ్యక్షుడు భాషాపాక యాదయ్య, పట్టణ అధ్యక్షుడు డి. వెంకటేష్, చర్లపల్లి అధ్యక్షుడు యాదయ్య, శంకర్, కేశవులు, ముంత ఎంకన్న, వజ్రయ్య, మోదుగుల రాంబాబు, నరేందర్, నరేంద్ర పాలకూరి, నాగరాజు, విద్య రామమూర్తి, బొంగరాల నాగయ్య, బాలస్వామి, రామినేని రహీం బాబా, వెంకన్న, పాలకూరి నాని, సుధాకర్ రెడ్డి, పాలకూరి శీను, టి. శీను తదితరులు పాల్గొన్నారు.
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments