ePaper
Saturday, September 5, 2026

అవయవదానంతో ప్రాణదానం:

చీకటి వెలుగు నల్లగొండ.

ఒక కుటుంబంలో విషాదం చోటుచేసుకున్న వేళ అవయవదానం ద్వారా మరో కుటుంబంలో ఆశాకిరణం వెలుగుతుందని సౌత్‌ ఇండియన్‌ ఆర్గన్‌ అండ్‌ బాడీ డొనేషన్‌ (స్పెక్ట్‌) చైర్‌పర్సన్‌ డా. గూడూరు సీతా మహాలక్ష్మి అన్నారు. శరీర, అవయవ, నేత్ర, రక్తదానాలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు నల్లగొండ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో అవగాహన సదస్సు నిర్వహించారు. అడ్వకేట్‌ లోడంగి గోవర్ధన్‌ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో అఖిల భారత శరీర, అవయవదాతల సంఘం జాతీయ సమన్వయకర్త ఎల్‌.వి. కుమార్‌ ముఖ్య అతిథిగా పాల్గొనగా, డా. గూడూరు సీతా మహాలక్ష్మి ప్రధాన వక్తగా ప్రసంగించారు. ఈ సందర్భంగా సీతా మహాలక్ష్మి మాట్లాడుతూ.. మెదడు పనిచేయని స్థితిలో ఉన్న వ్యక్తుల కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలోనూ మానవతా దృక్పథంతో అవయవదానానికి ముందుకు రావడం అభినందనీయమన్నారు. ఒకరి మరణం పలువురికి పునర్జీవనం కల్పించే అవకాశంగా మారుతుందని పేర్కొన్నారు. అవయవదానంపై ప్రజల్లో ఉన్న అపోహలు, అపార్థాలను తొలగించి మరింత చైతన్యం తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. “వైద్య రంగ పరిశోధనలకు నా దేహం ఉపయోగపడాలి. కట్టెలపై కాల్చడం, పూడ్చిపెట్టడం మాత్రమే కాదు.. మరణానంతరం కూడా నా దేహం సమాజానికి ఉపయోగపడాలనే ఆలోచన ప్రజల్లో రావాలి” అని సీతా మహాలక్ష్మి అన్నారు. శరీరదానం ద్వారా వైద్య విద్యార్థుల అధ్యయనంతోపాటు వైద్య పరిశోధనలకు అమూల్యమైన సహకారం అందించవచ్చని తెలిపారు. మనిషి జీవించి ఉన్నప్పుడు చేసే సేవలతో పాటు, మరణానంతరం కూడా తన దేహం, అవయవాలు ఇతరులకు ఉపయోగపడేలా నిర్ణయం తీసుకోవడం గొప్ప మానవతా దృక్పథమని పేర్కొన్నారు. రక్తదానం ద్వారా అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాలను కాపాడవచ్చని, మరణానంతరం నేత్రదానం చేయడం ద్వారా అంధుల జీవితాల్లో వెలుగులు నింపవచ్చని తెలిపారు. విద్యాదానం ద్వారా నిరుపేద విద్యార్థుల భవిష్యత్తుకు అండగా నిలవాలని సూచించారు. గత రెండున్నర దశాబ్దాలుగా శరీర, అవయవదానాలపై ప్రజల్లో ఉన్న అపోహలను తొలగిస్తూ అవగాహన కల్పించేందుకు చేస్తున్న కృషి సత్ఫలితాలను ఇస్తోందన్నారు. ఈ మానవతా ఉద్యమానికి ప్రభుత్వాల ప్రోత్సాహం కూడా అవసరమని పేర్కొన్నారు. అవయవదాత కుటుంబాల మానవత్వం సమాజానికి ఆదర్శమని, అలాంటి కుటుంబాలను ప్రభుత్వాలు మరింతగా ప్రోత్సహించి, గౌరవించాల్సిన అవసరముందన్నారు. కార్యక్రమంలో ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌ ప్రొఫెసర్‌ కె. శ్రీనివాసరాజు, జాతీయ సమన్వయకర్త సొంటె శ్రీనివాస్‌, జిల్లా అధ్యక్షుడు మిట్టపల్లి విజయ్‌భాస్కర్‌, సహ సమన్వయకర్త పి.ఎస్‌.ఎం. కెజియ, వాణిజ్యశాస్త్ర విభాగం కార్యక్రమ ఇన్‌చార్జి డా. కె. సాలయ్య తదితరులు పాల్గొన్నారు.


Discover more from cheekativelugu.com

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments

error: Content is protected !!