చీకటి వెలుగు నల్గొండ,
సమాజంలో సేవాభావాన్ని పెంపొందిస్తూ, వినియోగంలో లేని వస్తువులను అవసరమైన వారికి అందించాలనే లక్ష్యంతో నవయువ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ‘దయా గోడ’ (కైండ్‌నెస్ వాల్) కార్యక్రమాన్ని ప్రారంభించారు. నల్గొండ పట్టణంలోని ఎన్‌జీ కళాశాల ఎదురుగా ఉన్న పోలీసు పెట్రోల్ బంకు ప్రాంగణంలో నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని అదనపు ఎస్పీ జి. రమేష్, డీఎస్పీ కె. శివరాం రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా అదనపు ఎస్పీ జి. రమేష్ మాట్లాడుతూ.. ఇళ్లలో ఉపయోగించకుండా ఉన్న పాత బట్టలు, బొమ్మలు, పుస్తకాలు, ఎలక్ట్రానిక్ పరికరాలు తదితర వస్తువులను పారేయకుండా అవసరమైన వారికి అందించే ఉద్దేశంతో చేపట్టిన ఈ కార్యక్రమం అభినందనీయమన్నారు. చిన్న సహాయం కూడా ఎన్నో కుటుంబాలకు ఉపయోగపడుతుందని, ఇలాంటి సేవా కార్యక్రమాలు యువతలో సామాజిక బాధ్యతను పెంపొందిస్తాయని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారం అందించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. అనంతరం అదనపు ఎస్పీ జి. రమేష్, డీఎస్పీ కె. శివరాం రెడ్డి చేతుల మీదుగా చిన్నారులకు బొమ్మలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పెట్రోల్ బంకు ఇన్‌చార్జి బి. సంతోష్ (ఆర్‌ఐ), కె. నాగరాజు (ఆర్‌ఎస్‌ఐ), విజయ నల్గొండ (ఆర్‌ఎస్‌ఐ) పాల్గొన్నారు. నవయువ ఫౌండేషన్ అధ్యక్షుడు కె. విష్ణువర్ధన్ రెడ్డి, ఉపాధ్యక్షుడు ఎం. హరీష్, ప్రజాసంబంధాల ప్రతినిధి వి. మనీష్ కుమార్ రెడ్డి, కార్యదర్శి ఎం. గోపీనాథ్ రెడ్డి, సంయుక్త కార్యదర్శులు పి. లక్ష్మీ ప్రసన్న, కె. సంధ్యతో పాటు బి. చందు, అమూల్య, వంశీ, హరినాథ్ రెడ్డి తదితరులు హాజరయ్యారు.
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments