ePaper
Wednesday, July 22, 2026

మర్రిగూడ బైపాస్ ఫ్లైఓవర్ వద్ద ఉద్రిక్తత.. కంచర్ల భూపాల్ రెడ్డి అరెస్ట్.. దేవరకొండ పోలీస్ స్టేషన్‌కు తరలింపు..!

మర్రిగూడ బైపాస్ ఫ్లైఓవర్‌ను వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ చర్లపల్లి వద్ద ధర్నా నిర్వహిస్తున్న నల్గొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డితో పాటు పలువురు బీఆర్ఎస్ నాయకులను పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల మధ్య డీఎస్పీ ఆధ్వర్యంలో వారిని అదుపులోకి తీసుకుని, పలు పోలీస్ స్టేషన్లకు తరలించిన అనంతరం చివరకు దేవరకొండ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

అరెస్టు అనంతరం కంచర్ల భూపాల్ రెడ్డి మాట్లాడుతూ, ప్రజా సమస్యలపై శాంతియుతంగా చేపట్టిన ధర్నాను పోలీసులు అక్రమంగా అడ్డుకుని అరెస్ట్ చేశారని ఆరోపించారు. రెండు నెలల క్రితమే నిర్మాణం పూర్తయిన మర్రిగూడ బైపాస్ ఫ్లైఓవర్‌ను ఇప్పటికీ ప్రారంభించకపోవడం వల్ల వరుస ప్రమాదాలు జరుగుతున్నాయని, ఇప్పటికే ఒకరు ప్రాణాలు కోల్పోయారని పేర్కొన్నారు.

తాము అధికారంలో ఉన్న సమయంలో సీఎం కేసీఆర్ దృష్టికి సమస్యను తీసుకెళ్లి పానగల్ బైపాస్, మర్రిగూడ బైపాస్ ఫ్లైఓవర్లకు నిధులు మంజూరు చేయించి నిర్మాణం పూర్తి చేశామని చెప్పారు. రాజకీయ కారణాలతోనే మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫ్లైఓవర్ ప్రారంభోత్సవాన్ని ఆలస్యం చేస్తున్నారని ఆరోపించారు. ఇకనైనా అధికారులు వెంటనే ఫ్లైఓవర్‌ను ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చి ప్రమాదాలను నివారించాలని డిమాండ్ చేశారు.

అరెస్టయిన వారిలో మాజీ మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, నగర అధ్యక్షుడు భువనగిరి దేవేందర్, కార్పొరేటర్లు దొడ్డి గణేష్, దీప్లా నాయక్, గోపగోని స్వాతి రాజశేఖర్, గుండ్రెడ్డి యుగంధర్ రెడ్డి, పెండం ధనుంజయ్, మెండు చంద్రశేఖర్ రెడ్డి, అనిల్ నాయక్, చెనగోని నాగరాజు తదితరులు ఉన్నారు.


Discover more from cheekativelugu.com

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments

error: Content is protected !!