చీకటి వెలుగు నల్లగొండ
నల్లగొండ నగర మేయర్ శ్రీమతి బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి,
జిల్లా కలెక్టర్ శ్రీ బి. చంద్రశేఖర్ నల్లగొండ జిల్లా పశు వైద్యశాలలో జూనోసిస్ డే సందర్భంగా నిర్వహించిన వేడుకలలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నల్లగొండ నగర మేయర్ శ్రీమతి బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి, జిల్లా కలెక్టర్ శ్రీ బి. చంద్రశేఖర్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, పశువుల నుండి మనుషులకు, మనుషుల నుండి పశువులకు సంక్రమించే వ్యాధులను జూనోటిక్ వ్యాధులు అని పేర్కొన్నారు. రేబిస్, జపనీస్ ఎన్సెఫలైటిస్, బ్రుసెల్లోసిస్, బర్డ్ ఫ్లూ, లెప్టోస్పిరోసిస్, టీనియాసిస్ వంటి అనేక వ్యాధులు జంతువుల ద్వారా వ్యాపించే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ముఖ్యంగా రేబిస్ వ్యాధి అత్యంత ప్రమాదకరమైనదని, పిచ్చికుక్క కాటు వల్ల ఈ వ్యాధి సంక్రమిస్తుందని తెలిపారు. కుక్కల జనాభా నియంత్రణ కోసం పెంపుడు మరియు వీధి కుక్కలకు జంతు జనన నియంత్రణ (ABC) శస్త్రచికిత్సలు నిర్వహించడం అవసరమని పేర్కొన్నారు. ప్రస్తుతం నల్లగొండలో జంతు జనన నియంత్రణ కేంద్రం పనిచేస్తుండగా, మిర్యాలగూడ మరియు దేవరకొండలో కూడా ఇటువంటి కేంద్రాల ఏర్పాటు కోసం చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
వర్షాకాలంలో కుక్కలు ఎక్కువగా ఆవేశంగా ఉండే అవకాశం ఉన్నందున ప్రజల్లో, ముఖ్యంగా విద్యార్థుల్లో అవగాహన కల్పించాలని సూచించారు. చెత్తను బహిరంగ ప్రదేశాల్లో వేయకుండా చెత్త సేకరణ వాహనాల్లోనే వేయాలని, తద్వారా వీధి కుక్కలు గుంపులుగా చేరడాన్ని నివారించవచ్చని తెలిపారు. అలాగే కుక్కలకు వీధులలో ఆహారం వేయకుండా, ఇళ్లలోనే ఆహారం అందించాలని సూచించారు. అన్ని పెంపుడు కుక్కలకు స్థానిక సంస్థల ద్వారా లైసెన్సులు జారీ చేయడంతో పాటు, వీధి కుక్కలన్నింటికీ రేబిస్ నిరోధక టీకాలు వేయించాలని పిలుపునిచ్చారు.
జూనోటిక్ వ్యాధుల నివారణలో పశుసంవర్ధక శాఖ, వైద్య ఆరోగ్య శాఖ, మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీలు, స్వచ్ఛంద సంస్థలు సమన్వయంతో పనిచేసి ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని కోరారు.
ఈ సందర్భంగా 210 కుక్కలకు రేబిస్ నిరోధక టీకాలు వేయడంతో పాటు, బలహీనంగా ఉన్న కుక్కలకు టానిక్స్ పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో నగర డిప్యూటీ మేయర్ శ్రీ అష్రఫ్ అలీ అమీర్, అదనపు కలెక్టర్ శ్రీ ప్రేమ్ కరణ్ రెడ్డి, జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డాక్టర్ రాహుల్, రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ పరిశీలకులు శ్రీ శామ్యూల్ జాన్, జిల్లా పశు వైద్య మరియు పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్ జి.వి. రమేష్, పశుసంవర్ధక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్లు, వెటర్నరీ రెసిడెంట్ సర్జన్లు, పారా వెటర్నరీ సిబ్బంది, జంతు ప్రేమికులు, పెంపుడు కుక్కల యజమానులు పాల్గొన్నారు.
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments