ePaper
Wednesday, June 24, 2026

నీట్ సహా పరీక్షల అక్రమాలపై కేంద్రాన్ని టార్గెట్ చేస్తూ ఉద్యమానికి మద్దతు: పున్న కైలాష్ నేత

నల్లగొండ, జూన్ 23 (చీకటి వెలుగు ):

రాజస్థాన్ కోటలో ఇటీవల ప్రారంభమైన ‘చాత్రోంకి గూంజ్ – విద్యార్థి యువత గొంతుక’ మహా ఉద్యమానికి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నామని నల్గొండ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు పున్న కైలాష్ నేత తెలిపారు.
మంగళవారం నల్గొండ జిల్లా కేంద్రంలోని యాదవ సంఘం భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ఆలోచనలు దేశ యువత, విద్యార్థి కుటుంబాలకు భరోసా కల్పిస్తున్నాయని పేర్కొన్నారు. ఈ ఉద్యమానికి పార్టీకి అతీతంగా మద్దతు ఇవ్వాలని ఆయన పిలుపునిచ్చారు.
కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తూ, నీట్ పరీక్ష రద్దుకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ వ్యవహారం ప్రభుత్వ వైఫల్యమేనని, దీనిపై లోక్‌సభలో ఎన్డీఏ ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని కోరారు. ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని కూడా ఆయన డిమాండ్ చేశారు.
పరీక్షల రద్దు, ప్రశ్నపత్రాల లీకులు, ఉద్యోగ నియామకాల జాప్యం వంటి కారణాలతో సుమారు 25 లక్షల కుటుంబాలు నష్టపోయాయని ఆయన ఆరోపించారు. విద్యార్థుల ఆత్మహత్యలు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
2014 నుంచి ఇప్పటివరకు 148 పరీక్షలు లీక్ అయ్యాయని, నీట్, జేఈఈ, ఎస్‌ఎస్‌సీ, యూపీఎస్‌సీ, ఆర్‌ఆర్‌బీ వంటి పరీక్షలపై వరుసగా ఆరోపణలు వస్తున్నాయని తెలిపారు. గతంలో మధ్యప్రదేశ్ వ్యాపం కుంభకోణం, రాజస్థాన్ టీచర్ ఎగ్జామ్స్, రైల్వే ఎన్టీపీసీ పరీక్షల్లో జరిగిన అక్రమాలను కూడా ప్రస్తావించారు.
కేంద్ర ప్రభుత్వం ప్రజా రంగ సంస్థలను కార్పొరేట్ సంస్థలకు విక్రయిస్తోందని విమర్శించారు. విద్యార్థులు, ఉద్యోగార్థులు పరీక్షల కోసం భారీగా ఖర్చు చేస్తున్నారని, దేశ భవిష్యత్తు యువతపైనే ఆధారపడి ఉందని ఆయన అన్నారు.
ఈ సమావేశంలో ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు బోడ స్వామి, ఓబీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు జిల్లాపల్లి పరమేష్, ఏళ్ల రవీందర్ రెడ్డి, పగిళ్ల రాజు, చర్లపెళ్లి గౌతమ్, వేముల గోపీనాథ్, బట్టు జంగయ్య, ఎండి అజీజ్, చింత ధనుంజయ్, జమ్మూ అశోక్, ఆకటి సైదులు, ఎండి అమన్ తదితరులు పాల్గొన్నారు.


Discover more from cheekativelugu.com

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments

error: Content is protected !!