ePaper
Saturday, September 5, 2026

భరోసా కేంద్రాల సేవలు మరింత బలోపేతం–అన్ని శాఖల సమన్వయం అవసరం :

ఎస్పీ శరత్ చంద్ర పవార్

నల్లగొండ, జూన్ 23 (చీకటి వెలుగు ) :

మహిళలు, చిన్నారులపై జరిగే హింస, లైంగిక దాడులు, వేధింపుల కేసుల్లో బాధితులకు త్వరితగతిన న్యాయం అందించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్ సూచించారు.
తెలంగాణ రాష్ట్ర మహిళా భద్రత విభాగం ఆదేశాల మేరకు జిల్లా పోలీస్ కార్యాలయంలోని భరోసా కేంద్రం ఆధ్వర్యంలో నిర్వహించిన సమన్వయ సమావేశానికి పోక్సో ప్రత్యేక న్యాయమూర్తి విశ్వనాథ్ కులకర్ణి, ఎక్సైజ్ కోర్టు న్యాయమూర్తి సాయి మేఘనా, బాలల సంక్షేమ కమిటీ చైర్మన్ కృష్ణయ్యతో పాటు వివిధ శాఖల అధికారులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, లైంగిక దాడులకు గురైన మహిళలు, చిన్నారులకు ఒకేచోట వైద్య, న్యాయ, మానసిక, పునరావాస సేవలు అందించడమే భరోసా కేంద్రాల ప్రధాన లక్ష్యమని తెలిపారు. అవసరమైన వైద్య పరీక్షలు, కౌన్సెలింగ్, న్యాయ సహాయం, వాంగ్మూల నమోదు, పునరావాసం, పరిహారం వంటి సేవలను ఎలాంటి ఆలస్యం లేకుండా సమగ్రంగా అందించాలని సూచించారు.
జిల్లాలో 2021 నుంచి 2026 వరకు భరోసా కేంద్రం పరిధిలో పోక్సో, అత్యాచారం, మహిళలు, చిన్నారులపై దాడులకు సంబంధించిన 806 కేసులు నమోదైనట్లు తెలిపారు. వీటిలో 16 కేసుల్లో నిందితులకు శిక్షలు ఖరారయ్యాయని, బాధితులకు రూ.1.68 కోట్లకు పైగా పరిహారం అందించామని వెల్లడించారు.
పోక్సో కేసుల్లో శిక్షలు ఖరారు కావడంలో పోలీసులు, ప్రాసిక్యూషన్, వైద్య శాఖ, ఫోరెన్సిక్ నిపుణులు, భరోసా కేంద్రం సిబ్బంది సమన్వయంతో పనిచేయడం కీలకమని ఎస్పీ పేర్కొన్నారు. దర్యాప్తు, సాక్ష్యాల సేకరణ, న్యాయపరమైన ప్రక్రియలో నిర్లక్ష్యం లేకుండా వ్యవహరించాలని ఆదేశించారు.
సాంకేతిక ఆధారాలు, వైద్య నివేదికలు, బాధితుల వాంగ్మూలాలు కేసుల్లో అత్యంత కీలకమని, వాటిని నాణ్యతతో, నిర్దిష్ట గడువులో కోర్టుకు సమర్పించాలని సూచించారు. ప్రతి కేసును అత్యంత ప్రాధాన్యతతో తీసుకోవాలని స్పష్టం చేశారు.
బాల్య వివాహాల నివారణకు గ్రామాలు, పాఠశాలలు, కళాశాలల స్థాయిలో విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఎస్పీ సూచించారు. పోక్సో చట్టం, బాలల హక్కులు, సైబర్ నేరాలపై విద్యార్థులకు నిరంతర అవగాహన కల్పించాలని తెలిపారు.
లైంగిక వేధింపులు, దాడుల బాధితులు భయపడకుండా ఫిర్యాదు చేసేలా ప్రోత్సహించాలని, ప్రభుత్వం అందిస్తున్న పరిహారం పథకాలపై విస్తృత ప్రచారం చేయాలని పేర్కొన్నారు. బాధితుల పట్ల అన్ని శాఖలు మానవత్వంతో స్పందించాలని, వారి సంక్షేమమే లక్ష్యంగా పనిచేయాలని స్పష్టం చేశారు.
సమన్వయంతో పనిచేసినప్పుడే బాధితులకు సంపూర్ణ న్యాయం సాధ్యమవుతుందని ఎస్పీ శరత్ చంద్ర పవార్ పిలుపునిచ్చారు.
ఈ సమావేశంలో భరోసా కేంద్రం పనితీరు, కేసుల పురోగతి, పరిహారం పంపిణీ, పునరావాస కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు. కార్యక్రమంలో పబ్లిక్ ప్రాసిక్యూటర్ రంజిత్ కుమార్, మహిళా పోలీస్ స్టేషన్ సీఐ మంజుల, భరోసా కేంద్రం ఇన్‌చార్జ్ ఎస్‌ఐ అమ్రిన్, కోఆర్డినేటర్ నళినతో పాటు వైద్య, మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు, న్యాయ విభాగ ప్రతినిధులు పాల్గొన్నారు.


Discover more from cheekativelugu.com

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments

error: Content is protected !!