చీకటి వెలుగు, నల్లగొండ:

మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసి కోటీశ్వరులుగా తీర్చిదిద్దడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి Komatireddy Venkat Reddy కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు.
బుధవారం నల్గొండ జిల్లా మాడుగులపల్లి మండల కేంద్రంలో నిర్మాణంలో ఉన్న మండల కాంప్లెక్స్ భవనాల పనులను మంత్రి పరిశీలించారు. భవనాల నిర్మాణం నాణ్యతతో పూర్తి చేయాలని, పనులను త్వరితగతిన ముగించాలని అధికారులను ఆదేశించారు.
అనంతరం చెరువుపల్లి గ్రామంలో రూ.20 లక్షల వ్యయంతో నిర్మించిన గ్రామపంచాయతీ భవనాన్ని, రూ.10 లక్షలతో నిర్మించిన గ్రామ సమాఖ్య భవనాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మాడుగులపల్లి మండల అభివృద్ధికి రోడ్లు, ఇందిరమ్మ ఇండ్ల మంజూరు వంటి అనేక కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. రూ.6 కోట్లతో డబుల్ రోడ్డు, ఎల్లమ్మగూడెం, దాచారం ప్రాంతాల్లో విద్యుత్ సబ్స్టేషన్లు మంజూరు చేసినట్లు చెప్పారు. పార్టీలకతీతంగా అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు అందిస్తున్నామని పేర్కొన్నారు.
రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ ఉచిత విద్యుత్, రైతు భరోసా వంటి సంక్షేమ పథకాలను ప్రభుత్వం సమర్థవంతంగా అమలు చేస్తోందన్నారు. మాడుగులపల్లి–మర్రిగూడ డబుల్ రోడ్డు, రూ.60 కోట్లతో కోనేటిపురం డబుల్ రోడ్డు నిర్మాణ పనులు చేపట్టినట్లు తెలిపారు.
రాష్ట్రవ్యాప్తంగా రూ.20 వేల కోట్లతో హ్యాం రోడ్లు, మరో రూ.7 వేల కోట్లతో పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో గ్రామీణ రహదారుల నిర్మాణం జరుగుతోందన్నారు. దీంతో రోడ్డు ప్రమాదాలు తగ్గడమే కాకుండా పరిశ్రమలు ఏర్పడి యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని చెప్పారు.
తిప్పర్తి, కనగల్ మండలాల్లో జూనియర్ కళాశాలలను ఆధునిక మోడల్ భవనాలుగా అభివృద్ధి చేస్తామని తెలిపారు. రాష్ట్రంలోని 3.5 లక్షల ఇంటర్ విద్యార్థులకు ఉదయం అల్పాహారం, మధ్యాహ్న భోజనం అందిస్తున్నామని, దేశంలోనే ప్రత్యేకంగా ఈ పథకాన్ని అమలు చేస్తున్నామని పేర్కొన్నారు.
చెరువుపల్లి గ్రామపంచాయతీ భవన ప్రారంభోత్సవంలో మాట్లాడుతూ మహిళలందరూ స్వయం సహాయక సంఘాల్లో సభ్యులుగా చేరాలని పిలుపునిచ్చారు. మహిళా సంఘాల ద్వారా ప్రతి మండలంలో రైస్ మిల్లులు ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకుంటున్నామని, ప్రతి మండలానికి ఒక బస్సును మహిళా సంఘాలకు అందించామని, వడ్డీ లేని రుణాలు కూడా ఇస్తున్నామని తెలిపారు. మహిళలు పురుషులతో సమానంగా అన్ని రంగాల్లో ఎదగాలని ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.
చెరువుపల్లి గ్రామానికి 50 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేశామని, అవసరమైతే మరో 50 ఇండ్లు కూడా మంజూరు చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో మిర్యాలగూడ ఆర్డీవో రమణారెడ్డి, ఆర్ అండ్ బి ఎస్ఈ శ్రీధర్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ సైదులు, సర్పంచ్ సైదిరెడ్డి, సంపత్ రెడ్డి, ప్రజాప్రతినిధులు మరియు అధికారులు పాల్గొన్నారు.
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments