ePaper
Saturday, July 25, 2026

నల్గొండ జిల్లాలో విద్యాసంస్థల బంద్ విజయవంతం

విద్యార్థుల సమస్యల పరిష్కారం కోరుతూ ఎస్‌ఎఫ్‌ఐ, ఏఐఎస్‌ఎఫ్, పీడీఎస్‌యూ, డివైఎఫ్ఐ ఆందోళన

చీకటి వెలుగు – నల్గొండ | జూలై 10:

విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం ఎస్‌ఎఫ్‌ఐ, ఏఐఎస్‌ఎఫ్, పీడీఎస్‌యూ, డివైఎఫ్ఐ రాష్ట్ర కమిటీల పిలుపు మేరకు శుక్రవారం నల్గొండ జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, జూనియర్, డిగ్రీ కళాశాలల బంద్ విజయవంతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలో విద్యార్థి సంఘాల నాయకులు బైక్ ర్యాలీ నిర్వహించి ప్రభుత్వ విద్యను పరిరక్షించాలని నినాదాలు చేశారు.

ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఖమ్మంపాటి శంకర్, పీడీఎస్‌యూ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఇందూరు సాగర్, ఏఐఎస్‌ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ముదిగొండ మురళీకృష్ణ, డివైఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు మల్లం మహేష్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగాన్ని నిర్వీర్యం చేసే విధానాలను వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేశారు.

రాష్ట్రంలో 273 ప్రభుత్వ పాఠశాలలను నాలుగు కిలోమీటర్ల పరిధిలో విలీనం చేయాలనే నిర్ణయాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని కోరారు. ఈ నిర్ణయం గ్రామీణ, పేద, బడుగు, బలహీన వర్గాల విద్యార్థుల విద్యపై తీవ్ర ప్రభావం చూపుతుందని పేర్కొన్నారు.

విద్యాశాఖలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని, ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్, డిగ్రీ కళాశాలల్లో అధ్యాపకుల కొరతను నివారించాలని డిమాండ్ చేశారు. అలాగే ప్రభుత్వ విద్యాసంస్థల్లో తాగునీరు, మరుగుదొడ్లు, తరగతి గదులు, ఫర్నిచర్, ల్యాబ్‌లు, లైబ్రరీలు వంటి మౌలిక వసతులను కల్పించాలని కోరారు.

ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థలు అధిక ఫీజులు వసూలు చేయడం, పుస్తకాలు, నోట్‌బుక్స్, యూనిఫాంలను బలవంతంగా కొనుగోలు చేయించడం ద్వారా తల్లిదండ్రులను దోచుకుంటున్నాయని ఆరోపించారు. ఈ అక్రమాలపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న విద్యార్థుల స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని కోరారు. సకాలంలో నిధులు అందక వేలాది మంది పేద, మధ్యతరగతి విద్యార్థులు ఉన్నత విద్యను కొనసాగించడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ప్రతి విద్యా సంవత్సరం ప్రారంభంలోనే స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

అలాగే జాతీయ విద్యా విధానం (NEP–2020)ను తెలంగాణలో అమలు చేయకుండా ప్రభుత్వ విద్యను పరిరక్షించాలని, విద్యారంగానికి తగిన బడ్జెట్ కేటాయించి ప్రభుత్వ విద్యను బలోపేతం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.

విద్యార్థుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని, లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా మరింత ఉధృతమైన ఉద్యమాలు చేపడతామని విద్యార్థి సంఘాల నాయకులు హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు ఆకారపు నరేష్, పీడీఎస్‌యూ జిల్లా కార్యదర్శి పవన్, ఏఐఎస్‌ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు గాదెపాక సూర్యతేజ, ఎస్‌ఎఫ్‌ఐ డివిజన్ కార్యదర్శి మారుపాక కిరణ్, విద్యార్థి సంఘాల నాయకులు బి.వి. చారి, సైఫ్, అదిల్, వేణు, కండె యాదగిరి, రావణ్, భాను, గౌతమ్, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.


Discover more from cheekativelugu.com

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments

error: Content is protected !!