ePaper
Thursday, September 3, 2026

వెయ్యి రోజులు.. వందల హామీలు.. అంతా బాకీనే!

నల్లగొండలో బైక్‌ ర్యాలీ.. గడియారం సెంటర్‌లో భారీ నిరసన

చీకటి వెలుగునల్లగొండ:

కాంగ్రెస్‌ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలనలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని ఆరోపిస్తూ బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో నల్లగొండలో నిరసన కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. జిల్లా పార్టీ కార్యాలయం నుంచి వందలాది మంది నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ద్విచక్రవాహనాలతో భారీ ర్యాలీ నిర్వహించి గడియారం సెంటర్‌కు చేరుకున్నారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన నిరసన ఫ్లెక్సీలను ప్రదర్శిస్తూ భారీ మానవహారం, ధర్నా నిర్వహించారు. కార్యక్రమానికి స్వచ్ఛందంగా తరలివచ్చిన పార్టీ శ్రేణులతో గడియారం సెంటర్‌ సందడిగా మారింది. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి మాట్లాడుతూ మోసపూరిత మాటలు, అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలనలో అన్ని వర్గాల ప్రజలను దగా చేసిందని ఆరోపించారు. రైతులు, ఉద్యోగులు, కార్మికులు, యువత, విద్యార్థులు, మహిళలు సహా సామాన్య ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయలేదని విమర్శించారు. రాష్ట్రంలో ప్రతిపక్షాల పట్ల ప్రభుత్వం నిరంకుశ వైఖరి అవలంబిస్తోందని, ఎక్కడ చూసినా అవినీతి రాజ్యమేలుతోందని ఆరోపించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడంతో ప్రభుత్వం వివిధ వర్గాలకు పెద్ద మొత్తంలో బకాయి పడిందని పేర్కొన్నారు. మహిళలకు నెలకు రూ.2,500 చొప్పున రూ.82,500, కళ్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకాల కింద తులం బంగారం, వృద్ధులు, ఒంటరి మహిళలు, బీడీ కార్మికులకు నెలకు రూ.4 వేల చొప్పున 33 నెలలకు రూ.66 వేల బకాయి ఉందని తెలిపారు. దివ్యాంగులకు నెలకు రూ.6 వేల చొప్పున రూ.66 వేలు, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కింద రూ.12 వేల కోట్ల బకాయి ఉందని ఆరోపించారు. విద్యార్థినులకు స్కూటీల హామీని అమలు చేయలేదన్నారు. రైతు భరోసా కింద ఐదెకరాలకు రూ.1,02,000, రైతు రుణమాఫీ కింద రూ.2 లక్షలు, రైతు కూలీలకు ఉపాధి హామీ పథకం కింద ఏడాదికి రూ.12 వేల చొప్పున రెండేళ్లకు రూ.24 వేలు, నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి కింద రూ.1,32,000, విద్యార్థులకు విద్యా భరోసా కార్డు కింద రూ.5 లక్షలు, ఆటో కార్మికులకు ఏడాదికి రూ.12 వేల చొప్పున రెండేళ్లకు రూ.24 వేల చొప్పున ప్రభుత్వం బకాయి పడిందని పేర్కొన్నారు. రాష్ట్రంలోని ప్రతి వర్గానికి కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా బకాయిలు పేరుకుపోయేలా చేసిందని విమర్శించారు. ఈ నేపథ్యంలో సెప్టెంబరు 2 నుంచి 8వ తేదీ వరకు రోజుకో వర్గానికి సంబంధించిన హామీలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేలా వివిధ నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. ఇందులో భాగంగా గురువారం నియోజకవర్గంలోని అన్ని మండల రెవెన్యూ కార్యాలయాల ఎదుట రైతు సదస్సులు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. అనంతరం శాసనమండలి సభ్యుడు ఎంసీ కోటిరెడ్డితో కలిసి వివిధ వర్గాల ప్రజలకు ‘బాకీ కార్డులు’ పంపిణీ చేశారు. ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తూ ప్రయాణికులకు సైతం బాకీ కార్డులను అందజేశారు. భారీగా తరలివచ్చిన బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు ద్విచక్రవాహనాలతో నిర్వహించిన ర్యాలీ, అనంతరం జరిగిన నిరసనతో గడియారం సెంటర్‌లో రాజకీయ సందడి నెలకొంది. కార్యక్రమంలో రాష్ట్ర కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌ కటికం సత్తయ్యగౌడ్‌, మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ చీరా పంకజ్‌యాదవ్‌, మాజీ ఆర్వో మాలే శరణ్యరెడ్డి, రాష్ట్ర కార్యదర్శి నిరంజన్‌వలి, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ అధ్యక్షుడు రేగట్టె మల్లికార్జునరెడ్డి, నల్లగొండ మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ మందడి సైదిరెడ్డి, సింగిల్‌ విండో చైర్మన్లు వంగాల సహదేవరెడ్డి, ధోటి శ్రీనివాస్‌, సింగం రామ్మోహన్‌, మాజీ ఎంపీపీలు, పార్టీ మండల అధ్యక్షులు పల్‌రెడ్డి రవీందర్‌రెడ్డి, అయితగోని యాదయ్య, దేప వెంకట్‌రెడ్డి, కార్పొరేటర్లు మారగొని గణేష్‌, పెరిక యాదయ్య, పేర్ల అశోక్‌, కొందూరు ప్రవీణ్‌రెడ్డి, దొడ్డి రమేష్‌, గోపగోని స్వాతి, రాజశేఖర్‌, మాజీ కౌన్సిలర్లు రావుల శ్రీనివాసరెడ్డి, కొండూరు సత్యనారాయణ, దండంపెల్లి సత్తయ్య, పెరిక కరుణ్‌, జయరాజ్‌, కందుల లక్ష్మయ్య, బడుపుల శంకర్‌, తవిటి కృష్ణ, సుంకి రెడ్డి వెంకట్‌రెడ్డితో పాటు మహిళా నాయకులు మామిడి పద్మ, కొండ్రస్వరూప, కొప్పోలు విమలమ్మ, మర్రి రేణుక, నర్రా నిర్మల, కంచర్ల విజయరెడ్డి, పలువురు నాయకులు, సర్పంచులు, ఉపసర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, మాజీ సర్పంచులు, గ్రామ శాఖలు, అనుబంధ సంఘాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


Discover more from cheekativelugu.com

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments

error: Content is protected !!