ePaper
Friday, September 4, 2026

నల్లగొండ ప్రభుత్వ ఆసుపత్రిలో నర్సింగ్ సిబ్బంది ఆందోళన

చీకటి వెలుగు నల్లగొండ,

డిప్యూటీ మెడికల్‌ సూపరింటెండెంట్‌ తీరుపై తీవ్ర ఆరోపణలు.. నాలుగేళ్లుగా భరిస్తున్నామంటూ ఆవేదన
నల్లగొండ ప్రభుత్వ ఆసుపత్రిలో నర్సింగ్‌ సిబ్బంది, డిప్యూటీ మెడికల్‌ సూపరింటెండెంట్‌ మధ్య వివాదం ముదిరింది. మహిళా నర్సింగ్‌ అధికారులతో అనుచితంగా, అసభ్యకర భాషలో మాట్లాడుతున్నారని ఆరోపిస్తూ సిబ్బంది ఆందోళనకు దిగారు. డిప్యూటీ మెడికల్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ నాగేశ్‌ తీరుతో తాము తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘నాలుగేళ్లుగా భరిస్తున్నాం.. ఇక భరించలేక బయటకు వచ్చాం’’ అంటూ తమ సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు.
ఆసుపత్రిలో కనీస సౌకర్యాలు లేకపోయినా వాటి నిర్వహణ బాధ్యతలను నర్సింగ్‌ సిబ్బందిపైనే మోపుతున్నారని వారు ఆరోపించారు. తాగునీరు, మరుగుదొడ్లు, దుస్తులు మార్చుకునే గదులు, భద్రత, పారిశుద్ధ్యం వంటి మౌలిక సదుపాయాలు సరిగా లేవని తెలిపారు. ఆసుపత్రిలో భద్రత, పారిశుద్ధ్య లోపాలకు కూడా నర్సింగ్‌ సిబ్బందినే బాధ్యులను చేస్తూ వివరణ కోరుతున్నారని పేర్కొన్నారు.
ఈ నెలలోనే 14 మంది మహిళా నర్సింగ్‌ అధికారులకు వివరణ కోరుతూ మెమోలు జారీ చేయడంపై సిబ్బంది తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ విధులకు సంబంధించిన సమస్యలను పరిష్కరించాల్సిన అధికారులు.. కనీస సౌకర్యాల లోపాలను పట్టించుకోకుండా నర్సులపై చర్యలకు దిగుతున్నారని ఆరోపించారు. విధి నిర్వహణలో ఎదురవుతున్న సమస్యలను ఉన్నతాధికారులకు పలుమార్లు తెలియజేసినా పరిష్కారం లభించలేదని వాపోయారు.
మహిళా ఉద్యోగులతో అనుచిత వ్యాఖ్యలు చేస్తూ అవమానకరంగా మాట్లాడటం, మానసికంగా ఇబ్బందులకు గురిచేయడం సరికాదని నర్సింగ్‌ సిబ్బంది పేర్కొన్నారు. తమపై వస్తున్న ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని డిమాండ్‌ చేశారు. ఆసుపత్రిలో నర్సింగ్‌ సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యలను తక్షణమే పరిష్కరించి, అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరారు.
ఇదిలా ఉండగా, ప్రభుత్వ ఆసుపత్రిలో నెలకొన్న సమస్యలపై జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు దృష్టి సారించాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రైవేటు ఆసుపత్రులపై తనిఖీలు, చర్యలకే పరిమితం కాకుండా ప్రభుత్వ ఆసుపత్రుల్లో సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యలు, మౌలిక సదుపాయాల లోపాలపైనా అధికారులు దృష్టి పెట్టాలని ప్రజలు కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో ఆల్ నర్సింగ్ ఆఫీసర్స్ పాల్గొన్నారు


Discover more from cheekativelugu.com

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments

error: Content is protected !!