పోతిరెడ్డిపాడు ద్వారా ఆంధ్రప్రదేశ్‌కు నీటి తరలింపుపై ప్రభుత్వం స్పందించాలి: జగదీష్‌రెడ్డి
చీకటి వెలుగు నల్గొండ,
నాగార్జునసాగర్‌లో నీటి లభ్యత ఉన్నప్పటికీ ఎడమ కాల్వకు సాగునీరు విడుదల చేయకపోవడంపై మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్‌రెడ్డి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. శ్రీశైలం నుంచి పోతిరెడ్డిపాడు ద్వారా ఆంధ్రప్రదేశ్‌కు నీటిని తరలిస్తున్నా జిల్లా మంత్రులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. రైతుల ప్రయోజనాలను కాపాడేందుకు వెంటనే సాగర్ ఎడమ కాల్వతో పాటు దాని పరిధిలోని ఎత్తిపోతల పథకాలకు నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. నల్గొండ జిల్లా కేంద్రంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. శ్రీశైలానికి వరద వస్తున్నప్పటికీ ఆ నీరు ఎక్కడికి వెళ్తుందో అందరికీ తెలుసన్నారు. పోతిరెడ్డిపాడు ద్వారా నీటిని తరలిస్తూ రాయలసీమలోని ప్రాజెక్టులను నింపుతున్నారని ఆరోపించారు. సాగర్ పూర్తిస్థాయిలో నిండిన తర్వాత మిగులు జలాలను మాత్రమే పోతిరెడ్డిపాడు ద్వారా తరలించాలనే నిబంధన ఉందని పేర్కొన్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం హయాంలో సాగర్‌లో తక్కువ నీటిమట్టం ఉన్నప్పటికీ వరుసగా 17 సార్లు సాగునీరు అందించామని జగదీష్‌రెడ్డి తెలిపారు. ఎడమ కాల్వ పరిధిలోని ఎత్తిపోతల పథకాలకు కూడా నీటిని సమృద్ధిగా ఇచ్చామని చెప్పారు. ప్రస్తుతం సాగర్‌లో 532 అడుగుల నీటిమట్టం ఉందని, సుమారు 30 టీఎంసీల నీరు అందుబాటులో ఉన్నందున సాగుకు నీటిని విడుదల చేయవచ్చని అన్నారు. ప్రస్తుత ప్రభుత్వం నీరు ఉన్నప్పటికీ కాల్వలకు విడుదల చేయకుండా యాగాల పేరుతో కాలయాపన చేస్తోందని విమర్శించారు. రైతులు పంటలు పండించకుండా అడ్డుకోవాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆరోపించారు. పంటలు పండితే బోనస్, యూరియా అందించాల్సి వస్తుందనే కారణంతో సాగునీరు విడుదల చేయడం లేదని వ్యాఖ్యానించారు. జిల్లా మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పదవుల భయంతో ఆంధ్రప్రదేశ్‌కు లొంగిపోయారని జగదీష్‌రెడ్డి ఆరోపించారు. సాగర్ ఆయకట్టు రైతులకు నీరు ఎందుకు ఇవ్వడం లేదో ప్రభుత్వం స్పష్టమైన సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో పంటలు సాగవుతున్నప్పుడు తెలంగాణ రైతులకు సాగునీరు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. పోతిరెడ్డిపాడు ద్వారా ఇప్పటివరకు 148 టీఎంసీల నీటిని తరలించారని ఆయన ఆరోపించారు. ఇది ప్రకృతి సృష్టించిన కరువు కాదని, కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల ఏర్పడిన కరువని విమర్శించారు. తెలంగాణ ఏర్పడక ముందు ఉన్న పరిస్థితులు మళ్లీ కనిపిస్తున్నాయని అన్నారు. సాగర్ నీరు తెలంగాణ రైతుల హక్కు అని, వెంటనే ఎడమ కాల్వతో పాటు ఎత్తిపోతల పథకాలకు నీటిని విడుదల చేయాలని జగదీష్‌రెడ్డి డిమాండ్ చేశారు. సమస్య పరిష్కారం కాకపోతే రైతులతో కలిసి ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌తో చర్చించి పార్టీ తరఫున పెద్ద ఎత్తున పోరాటానికి కార్యాచరణ రూపొందిస్తామని తెలిపారు. రైతుల కోసం ఎలాంటి పోరాటానికైనా సిద్ధమని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ ఎం.సి. కోటిరెడ్డి, నల్గొండ జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ బండా నరేందర్‌రెడ్డి, బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు కంచర్ల కృష్ణారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్‌రెడ్డి, నల్లమోతు భాస్కర్‌రావు, హుజూర్‌నగర్ నియోజకవర్గ ఇన్‌చార్జి ఒంటెద్దు నరసింహారెడ్డి, నల్గొండ మున్సిపల్ మాజీ చైర్మన్ మందడి సైదిరెడ్డి, నగర పార్టీ అధ్యక్షుడు బోనగిరి దేవేందర్‌తో పాటు పలువురు కార్పొరేటర్లు, నియోజకవర్గ నాయకులు పాల్గొన్నారు.
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments