ePaper
Saturday, September 5, 2026

ఉద్యమకారుల గుర్తింపులో జర్నలిస్టులకు ప్రాధాన్యం ఇవ్వాలి: టీయూడబ్ల్యూజే

తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేసిన జర్నలిస్టులను ఉద్యమకారులుగా గుర్తించి, వారి సేవలు, త్యాగాలకు తగిన గౌరవం కల్పించాలని తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయూడబ్ల్యూజే–ఐజేయూ) రాష్ట్ర అధ్యక్షుడు కె. విరాహత్ అలీ కోరారు.

మంగళవారం హైదరాబాద్ ట్యాంక్‌బండ్‌లోని తెలంగాణ అమరజ్యోతి వద్ద తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు, గౌరవం, సంక్షేమంపై ఉద్యమ గుర్తింపు కమిటీ నిర్వహించిన సంప్రదింపుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు.

తెలంగాణ ఉద్యమ సమయంలో జర్నలిస్టులు కేవలం వార్తల ప్రసారానికే పరిమితం కాకుండా ప్రజల ఆకాంక్షలు, ఆవేదన, ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటిచెప్పారని అన్నారు. ప్రత్యేక రాష్ట్ర అవసరాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు ఉద్యమానికి నైతిక బలం చేకూర్చారని పేర్కొన్నారు.

అనేక ప్రాంతాల్లో జర్నలిస్టులు ర్యాలీలు, ధర్నాలు, నిరసన కార్యక్రమాల్లో ప్రత్యక్షంగా పాల్గొనడమే కాకుండా, పలుచోట్ల ఉద్యమ జాయింట్ యాక్షన్ కమిటీలకు నాయకత్వం వహించారని గుర్తు చేశారు. ఉద్యమ సమయంలో పోలీసుల లాఠీచార్జీలు, కెమెరాల ధ్వంసం, తప్పుడు కేసులు, బెదిరింపులు వంటి ఇబ్బందులు ఎదురైనా వెనక్కి తగ్గకుండా విధులు నిర్వర్తించారని తెలిపారు.

ఉద్యమంలో పాల్గొన్న కారణంగా పలువురు జర్నలిస్టులు ఉద్యోగాలు కోల్పోయారని, కొందరు యాజమాన్యాల ఒత్తిళ్లను ఎదుర్కొన్నారని, మరికొందరు రాజీనామా చేయాల్సి వచ్చిందని అన్నారు. అయినప్పటికీ వ్యక్తిగత ప్రయోజనాలను పక్కనపెట్టి తెలంగాణ సమాజం కోసం పనిచేశారని పేర్కొన్నారు.

ఈ నేపథ్యంలో ఉద్యమ గుర్తింపు కమిటీ సానుభూతితో పరిశీలించి, ఉద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొన్న జర్నలిస్టులకు ఉద్యమకారుల గుర్తింపు కల్పించేలా చర్యలు తీసుకోవాలని విరాహత్ అలీ విజ్ఞప్తి చేశారు. అనంతరం యూనియన్ తరఫున వినతిపత్రాన్ని కమిటీ సభ్యులు ప్రొఫెసర్ కోదండరాం, రాములు నాయక్, శోభన్ రెడ్డికి అందజేశారు.


Discover more from cheekativelugu.com

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments

error: Content is protected !!