ePaper
Saturday, September 5, 2026

పాఠశాలల ప్రారంభ వేళ విద్యార్థులతో కలిసి భద్రతా అవగాహన నింపిన జిల్లా ఎస్పి శరత్ చంద్ర పవార్ ఐపీఎస్.చీకటి వెలుగు నల్గొండ.పాఠశాలలు తిరిగి సందడిగా మారిన మొదటి రోజే నల్లగొండ పట్టణంలోని పానగల్ ప్రభుత్వ పాఠశాలలో ప్రత్యేక వాతావరణం నెలకొంది. సాధారణంగా తరగతులు ప్రారంభమవుతాయని భావించిన విద్యార్థులకు ఈ రోజు ఒక ప్రత్యేక అనుభవంగా మారింది. జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్ గారు స్వయంగా ప్రభుత్వ పాఠశాలను సందర్శించి విద్యార్థులతో మాట్లాడటం అందరిలో ఆసక్తిని కలిగించింది.

తరగతి గదిలో విద్యార్థుల మధ్య నిలబడి ఎస్పీ గారు ఎంతో సరళంగా మాట్లాడారు. “చదువు మాత్రమే కాదు… జీవితంలో భద్రత కూడా చాలా ముఖ్యం” అంటూ రోడ్డు భద్రతపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. చిన్న వయస్సులో వాహనాలు నడపడం ఎంత ప్రమాదకరమో వివరించారు. ట్రాఫిక్ నియమాలు పాటించడం ద్వారా అనేక ప్రమాదాలను నివారించవచ్చని, తెలిపారు.ద్విచక్ర వాహనాలపై వెళ్లే క్రమంలో హెల్మెట్ ధరించాలని వారి తల్లితండ్రులకు అవగాహన కలిపించాలని చెప్పారు.

తర్వాత ప్రస్తుతం యువత ఎక్కువగా ఉపయోగిస్తున్న మొబైల్ ఫోన్లు, సోషల్ మీడియా గురించి ప్రస్తావించారు. తెలియని వ్యక్తులతో మాట్లాడటం, లింకులు ఓపెన్ చేయడం, వ్యక్తిగత వివరాలు పంచుకోవడం వలన సైబర్ నేరాలకు గురయ్యే అవకాశం ఉంటుందని హెచ్చరించారు. విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

మాదకద్రవ్యాల గురించి మాట్లాడుతూ “డ్రగ్స్ జీవితాన్ని నాశనం చేస్తాయి… మీ లక్ష్యాలను దూరం చేస్తాయి” అంటూ యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని స్పష్టం చేశారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు చెప్పే మాటలు వినాలని, మంచి స్నేహితులను ఎంచుకోని ఉన్నత స్థానాలకు ఎదగాలని సూచించారు.

ఎస్పీ గారి సందేశాలను విద్యార్థులు ఎంతో ఆసక్తిగా విన్నారు. కొందరు విద్యార్థులు ప్రశ్నలు అడగగా, ఆయన సహనంగా సమాధానాలు ఇచ్చారు. కార్యక్రమం ముగిసే సరికి విద్యార్థుల్లో కొత్త అవగాహన, ఉత్సాహం కనిపించింది.అనంతరం విద్యార్థులకు నోట్ బుక్స్, పెన్నులు, చాక్లెట్స్ అందజేశారు.

ఈ కార్యక్రమంలో నల్లగొండ డిఎస్పీ శివరాం రెడ్డి, 2 టౌన్ సీఐ రాఘవరావు, ఎస్. ఐ మానస, పోలీసు అధికారులు, పాఠశాల ఉపాధ్యాయులు, పాల్గొన్నారు.


Discover more from cheekativelugu.com

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments

error: Content is protected !!