సాగునీటి ప్రాజెక్టులు, రహదారులు, ధాన్యం సేకరణపై అధికారులతో సమీక్ష
చీకటి వెలుగు, నల్లగొండ:
నీటిపారుదల, రహదారులు, వ్యవసాయం తదితర అన్ని రంగాల్లో నల్గొండ జిల్లాను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. రైతు సంక్షేమమే ప్రధాన ధ్యేయంగా ప్రభుత్వం వ్యవసాయ రంగానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు.
బుధవారం నల్గొండ జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయం ఇందిరా భవన్లో జిల్లా అధికారులతో సాగునీటి ప్రాజెక్టులు, రహదారుల అభివృద్ధి, ధాన్యం సేకరణ తదితర అంశాలపై మంత్రి సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, నల్గొండ జిల్లా అంతటా సాగునీరు అందించి జిల్లాను సస్యశ్యామలం చేయడమే తమ లక్ష్యమని తెలిపారు. అందుకే ఏఎంఆర్పీ కాలువల లైనింగ్, బ్రాహ్మణ వెల్లెముల ప్రాజెక్టు, ఎస్ఎల్బీసీ సొరంగం వంటి కీలక పనులు చేపట్టినట్లు పేర్కొన్నారు.
బ్రాహ్మణ వెల్లెముల ప్రాజెక్టు పరిధిలో పెండింగ్‌లో ఉన్న మైనర్లు, సబ్ మైనర్ల పనులపై ఇరిగేషన్ అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా నార్కెట్‌పల్లి మండలం కొండపాకోనిగూడెంలో ఓ రైతు పొలంలో 40 మీటర్ల మేర కాలువ పనులు నిలిచిపోయిన విషయాన్ని అధికారులు మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై స్పందించిన మంత్రి, రైతుకు తగిన నష్టపరిహారం మంజూరు చేసి వెంటనే పనులు ప్రారంభించాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు.
కొండపాకోనిగూడెం చెరువు నిండితే దోమలపల్లి చెరువు కూడా నిండుతుందని, తద్వారా ఇతర చెరువులను నింపుకునే అవకాశం ఏర్పడి మండలంలోని అన్ని గ్రామాలకు సాగునీరు అందుతుందని మంత్రి వివరించారు.
ధాన్యం సేకరణలో నల్గొండ జిల్లా రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలవడం పట్ల జిల్లా కలెక్టర్‌ను మంత్రి అభినందించారు. జిల్లాలో గతంలో ఎన్నడూ లేనివిధంగా రికార్డు స్థాయిలో ధాన్యం ఉత్పత్తి జరిగిందని పేర్కొన్నారు. అయితే ప్రతి సీజన్లో రైతులు వరి పంటకే పరిమితం కాకుండా ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. పంట మార్పిడిపై అధికారులు, మహిళా సంఘాలు రైతులకు విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు.
ఆర్ అండ్ బి రహదారులపై నిర్వహించిన సమీక్షలో భాగంగా నార్కెట్‌పల్లి వద్ద రైల్వే ఓవర్ బ్రిడ్జి (ఆర్ఓబీ) నిర్మాణ పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. మిగిలిన భూసేకరణ చెల్లింపులు పూర్తి చేసి, పనులకు అవసరమైన అనుమతులు మంజూరు చేయాలని అధికారులకు సూచించారు. పనులు త్వరితగతిన పూర్తి చేసేందుకు కలెక్టర్ వద్ద ఉన్న నిధులను వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్‌కు మంత్రి ఆదేశాలు జారీ చేశారు.
ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్, నల్గొండ మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి, రెవెన్యూ అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్, స్థానిక సంస్థల ఇన్చార్జి అదనపు కలెక్టర్ వై. అశోక్ రెడ్డి, ఆర్ అండ్ బి ఎస్ఈ శ్రీధర్ రెడ్డి, పంచాయతీరాజ్ ఈఈ గిరిధర్ రెడ్డి, ఇరిగేషన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పిచ్చయ్య, పౌర సరఫరాల డీఎం రాంపతి నాయక్ తదితర అధికారులు పాల్గొన్నారు.
ఈ కథనంలో ప్రస్తావించిన మంత్రి Komatireddy Venkat Reddy, జిల్లా కలెక్టర్ B. Chandrashekhar మరియు నల్గొండ మేయర్ Burri Chaitanya Srinivas Reddy.
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments