ముస్లిం మైనార్టీలకు రిజర్వేషన్లతో పాటు నాణ్యమైన విద్య అందిస్తాం: మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి
రూ.44 లక్షలతో ఉర్దూ మీడియం ప్రైమరీ స్కూల్ భవనానికి శంకుస్థాపన
చీకటి వెలుగు, నల్లగొండ:
ముస్లిం మైనార్టీలకు రిజర్వేషన్లతో పాటు నాణ్యమైన విద్యను అందించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు.
బుధవారం నల్లగొండ జిల్లా కేంద్రంలోని మాన్యం చెల్క ప్రాంతంలో రూ.44 లక్షల వ్యయంతో నిర్మించనున్న ఉర్దూ మీడియం ప్రైమరీ స్కూల్ భవన నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, పాఠశాల నిర్మాణ పనులు గురువారం నుంచి ప్రారంభమవుతాయని, అవసరమైతే రూ.1 కోటి వరకు ఖర్చు చేసి అత్యుత్తమ సౌకర్యాలతో భవనాన్ని నిర్మిస్తామని తెలిపారు. తమ ప్రభుత్వం విద్య, వైద్య రంగాలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు.
గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఉర్దూను రెండవ భాషగా గుర్తించడం జరిగిందని, సచార్ కమిటీ సిఫారసుల మేరకు ముస్లిం మైనార్టీలకు 4 శాతం రిజర్వేషన్లు కల్పించినట్లు గుర్తు చేశారు. విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లతో పాటు నాణ్యమైన విద్య అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందన్నారు.
నల్లగొండలోని ప్రతీక్ మెమోరియల్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కంప్యూటర్ విద్యతో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) శిక్షణ అందిస్తున్నామని, ముస్లిం మైనార్టీ విద్యార్థులు ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. బొట్టుగూడ పాఠశాలలో కూడా చిన్న తరగతుల నుంచే ఏఐ శిక్షణ అందిస్తున్నామని, ఉర్దూ మీడియం ప్రైమరీ స్కూల్‌ను కూడా అదే స్థాయిలో అభివృద్ధి చేస్తామని తెలిపారు.
ముస్లిం మైనార్టీల కోసం రూ.10 కోట్ల వ్యయంతో షాదీఖానా నిర్మించనున్నట్లు వెల్లడించిన మంత్రి, పేద ముస్లిం కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని, స్థలం ఉన్నచోట ఇళ్లు నిర్మించి అందిస్తామని తెలిపారు. పట్టణ ప్రజలు తమ సమస్యలను కార్పొరేటర్ల ద్వారా లేదా నేరుగా తన దృష్టికి తీసుకువస్తే వెంటనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
నల్లగొండ మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం విద్య, వైద్య రంగాలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు.
జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ మాట్లాడుతూ మంత్రి ఆదేశాల మేరకు పేద ప్రజలకు నాణ్యమైన విద్య, వైద్యం అందించేందుకు కృషి చేస్తున్నామని, ఉర్దూ మీడియం ప్రైమరీ స్కూల్ భవన నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు ఆఫీస్ ఖాన్, జిల్లా విద్యాశాఖ అధికారి సుశీందర్ రావు, మౌలానా సిద్ధిఖీ, బషీర్, అక్బర్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.
అనంతరం మంత్రి కలెక్టర్ కార్యాలయం వెనుక నిర్మించిన డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను పరిశీలించి, చిన్న చిన్న మరమ్మతులు పూర్తి చేసి జూలై నెలలో గృహప్రవేశాలకు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments