ePaper
Saturday, June 6, 2026

ఘనంగా ‘బాల పంచాయతీ’ కార్యక్రమం

పిల్లల్లో నాయకత్వం, సామాజిక బాధ్యత పెంపొందించడమే లక్ష్యం

చీకటి వెలుగు నల్లగొండ:
కనగల్ మండలం చెర్లగౌరారం గ్రామంలో జిల్లా పోలీస్ శాఖ, ఉమెన్ సేఫ్టీ వింగ్ ఆదేశాల మేరకు యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ (AHTU) ఆధ్వర్యంలో నిర్వహించిన ‘బాల పంచాయతీ’ కార్యక్రమం ఘనంగా జరిగింది. పిల్లల్లో నాయకత్వ లక్షణాలు, విమర్శనాత్మక ఆలోచన, సామాజిక బాధ్యత, సమస్యల పరిష్కార నైపుణ్యాలను పెంపొందించే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.

కార్యక్రమానికి టీజీపీఏ డైరెక్టర్ అభిలాషా బిష్త్ ఐపీఎస్, జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ ఐఏఎస్, జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్ ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు. గ్రామస్థాయి నుంచే పిల్లలకు ప్రజాస్వామ్య అవగాహన కల్పించడం, వారి అభిప్రాయాలను వినడం, గ్రామాభివృద్ధిలో భాగస్వాములను చేయడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యమని నిర్వాహకులు తెలిపారు.

కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు పాఠశాలల్లో మౌలిక వసతులు, పరిశుభ్రత, తాగునీటి సౌకర్యం, బాలల భద్రత, విద్యా ప్రమాణాలు, గ్రామాభివృద్ధి వంటి అంశాలపై తమ అభిప్రాయాలను ధైర్యంగా వ్యక్తపరిచారు. బాలలతో నిర్వహించిన ఇంటరాక్టివ్ సెషన్లు, అవగాహన కార్యక్రమాలు, ప్రశ్నోత్తర సమావేశాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

ఈ సందర్భంగా అభిలాషా బిష్త్ మాట్లాడుతూ, పిల్లల హక్కులు మరియు వారి భవిష్యత్ నిర్మాణం సమాజానికి అత్యంత ముఖ్యమని పేర్కొన్నారు. పిల్లల రక్షణ కుటుంబం నుంచే ప్రారంభమవుతుందని, తల్లిదండ్రులు పిల్లలకు సమయం కేటాయించి వారి ఆలోచనలను ప్రోత్సహించాలని సూచించారు. పిల్లల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసి సరైన మార్గనిర్దేశం చేస్తే భవిష్యత్తులో సమాజానికి ఉపయోగపడే నాయకులుగా ఎదుగుతారని తెలిపారు.

జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ, గ్రామస్థాయి నుంచే పిల్లలకు నాయకత్వ అవకాశాలు కల్పించడం ద్వారా సమాజంలో సానుకూల మార్పు తీసుకురావచ్చని అన్నారు. విద్యతో పాటు సామాజిక అవగాహన కూడా ఎంతో అవసరమని, బాలలు తమ హక్కులు, బాధ్యతలపై అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు.

జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ మాట్లాడుతూ, బాలల భద్రత, విద్య, మానసిక అభివృద్ధి కోసం జిల్లా పోలీస్ శాఖ నిరంతరం కృషి చేస్తోందని తెలిపారు. ప్రతి గ్రామంలో బాలల రక్షణ, సంక్షేమంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు.

కార్యక్రమంలో యంగిస్థాన్, ఆశ్రిత ఎన్జీఓ ప్రతినిధులు పాల్గొని బాలల హక్కులు, విద్య ప్రాముఖ్యత, సురక్షిత బాల్యం, మానసిక ఆరోగ్యం వంటి అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. స్థానిక సర్పంచ్ గ్రామంలో బాలల సాధికారత, సంక్షేమం కోసం అన్ని విధాలుగా సహకరిస్తామని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో ఏఎస్పీ రమేష్, నల్లగొండ డీఎస్పీ శివరాం రెడ్డి, ఎంపీడీఓ వేద రక్షిత, సీఐలు ఆది రెడ్డి, రాము, కరుణాకర్, ఎస్‌ఐలు అంజలి, రాజీవ్ రెడ్డి, డీడబ్ల్యూఓ కృష్ణవేణి, డీఈఓ సుశీందర్ రావు, సీడబ్ల్యూసీ చైర్మన్ కృష్ణయ్య, గ్రామ ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయులు, ఆశా వర్కర్లు, అంగన్‌వాడీ సిబ్బంది, యువత, మహిళా సంఘాల ప్రతినిధులు మరియు 300 మందికి పైగా గ్రామస్తులు పాల్గొన్నారు.


Discover more from cheekativelugu.com

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments

error: Content is protected !!