ePaper
Wednesday, June 3, 2026

ధర్వేశిపురం శ్రీ రేణుక ఎల్లమ్మ దేవాలయాన్ని మోడల్‌గా తీర్చిదిద్దుతాం: మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి

కనగల్ మండలం, ధర్వేశిపురం: కనగల్ మండలంలోని ధర్వేశిపురంలో వెలసిన శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి దేవాలయాన్ని రాష్ట్రంలోనే ఆదర్శ దేవాలయంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు.

మంగళవారం ధర్వేశిపురంలోని శ్రీ రేణుక ఎల్లమ్మ అమ్మవారి దేవాలయం నూతన ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి, అనంతరం మాట్లాడుతూ దేవాలయ అభివృద్ధికి ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తోందన్నారు. ఇప్పటికే ఆలయం వద్ద కళ్యాణ మండపం, వాటర్ ట్యాంక్ నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు.

నల్గొండ–ధర్వేశిపురం మధ్య రూ.50 కోట్ల కేంద్ర రహదారుల నిధులతో నూతన రహదారి నిర్మాణానికి టెండర్ ప్రక్రియ పూర్తైందని, బుధవారం నుంచి పనులు ప్రారంభమవుతాయని వెల్లడించారు. అలాగే ధర్వేశిపురం ప్రాంతంలో ఒక పెద్ద పరిశ్రమను ఏర్పాటు చేసే దిశగా ఆలోచనలు జరుగుతున్నాయని చెప్పారు.

రూ.239 కోట్ల వ్యయంతో ధర్వేశిపురం మీదుగా గుర్రంపోడు–కొండమల్లేపల్లి–దేవరకొండ–డిండి వరకు హ్యాం (HAM) రహదారి నిర్మాణం చేపడుతున్నట్లు మంత్రి వివరించారు.

గ్రామాభివృద్ధికి ప్రత్యేక చర్యలు

ధర్వేశిపురాన్ని మోడల్ గ్రామంగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో త్వరలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని గ్రామానికి తీసుకురానున్నట్లు మంత్రి తెలిపారు. రహదారుల అభివృద్ధి జరిగితేనే అన్ని రంగాల్లో పురోగతి సాధ్యమవుతుందని పేర్కొన్నారు.

రాష్ట్రవ్యాప్తంగా రూ.1,300 కోట్లతో 480 రహదారులను డబుల్ రోడ్లుగా అభివృద్ధి చేసేందుకు టెండర్లు పూర్తయ్యాయని చెప్పారు. ధర్వేశిపురం, కనగల్ మండలంలో ఇండ్లు లేని పేదలకు ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు.

నల్గొండ జిల్లా అభివృద్ధిలో భాగంగా ఏఎంఆర్పీ కాలువల లైనింగ్ పనులు కొనసాగుతున్నాయని, రానున్న రెండేళ్లలో ఎస్ఎల్బీసీ సొరంగం పూర్తయితే రైతులకు రెండు పంటలకు నీరందే పరిస్థితి ఏర్పడుతుందని తెలిపారు.

నల్గొండ అభివృద్ధికి భారీ ప్రణాళికలు

నల్గొండ పట్టణ అభివృద్ధి కోసం రూ.900 కోట్లతో రింగ్ రోడ్డు నిర్మాణం చేపడుతున్నామని, తాగునీటి సదుపాయాల విస్తరణతో పాటు విద్యారంగ అభివృద్ధికి కూడా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని మంత్రి పేర్కొన్నారు. బొట్టుగూడ ప్రభుత్వ పాఠశాలను కార్పొరేట్ స్థాయి సౌకర్యాలతో అభివృద్ధి చేసినట్లు తెలిపారు.

గ్రామాల రూపురేఖలు మార్చేలా రాష్ట్ర ప్రభుత్వం అన్ని గ్రామాల్లో రోడ్లు, సీసీ రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థలను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు.

దేవాలయ అభివృద్ధికి రూ.10 కోట్లు

దేవాలయ నూతన ధర్మకర్తల మండలి అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన సిహెచ్ వెంకట్ రెడ్డి మాట్లాడుతూ, రేణుక ఎల్లమ్మ అమ్మవారి దేవాలయ అభివృద్ధికి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆధ్వర్యంలో రూ.10 కోట్లు కేటాయించారని తెలిపారు. ఇప్పటికే రూ.5 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టామని, మిగిలిన నిధులతో ఆలయ పునర్నిర్మాణ పనులను పూర్తి చేస్తామని చెప్పారు.

అలాగే ధర్వేశిపురంలో అంగన్‌వాడీ కేంద్రం నిర్మాణం, పాఠశాలకు వెళ్లే రహదారి మంజూరు చేయాలని మంత్రిని కోరారు.

ఈ సందర్భంగా మంత్రి రేణుక ఎల్లమ్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ పూజారులు, దేవాదాయ శాఖ అధికారులు పూర్ణకుంభం, మేళతాళాలతో ఘన స్వాగతం పలికారు.

కార్యక్రమంలో నల్గొండ ఆర్డీవో వై. అశోక్ రెడ్డి, డీఎస్పీ శివరాం రెడ్డి, దేవాదాయ శాఖ అధికారులు, కనగల్ తహసీల్దార్ పద్మ, ఆలయ ఈవో, ధర్మకర్తల మండలి సభ్యులు మరియు పలువురు భక్తులు పాల్గొన్నారు. ధర్మకర్తల మండలి సభ్యులు తెలుగులో ప్రమాణ స్వీకారం చేశారు.


Discover more from cheekativelugu.com

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments

error: Content is protected !!