Loading Time...
Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

నీళ్ల కోసం రైతన్న కన్నీళ్లు! సాగునీరు లేక ఎండుతున్న పంటలు.. కళ్లముందే కరిగిపోతున్న అన్నదాత ఆశలు..

Author
Posted By CHEEKATI VELUGU
| 07 Oct 2026, 09:59 AM | TELANGANA
నీళ్ల కోసం రైతన్న కన్నీళ్లు! సాగునీరు లేక ఎండుతున్న పంటలు.. కళ్లముందే కరిగిపోతున్న అన్నదాత ఆశలు..

  • వ్యాసకర్త : కుకుట్ల వరుణ్ జర్నలిస్ట్..

నీళ్లు లేక.. ఎండుతున్న పంటలు!
నీళ్ల కోసం రైతన్న ఎదురుచూపులు..
పెట్టుబడులు పెట్టి పంటను కాపాడుకునేందుకు నానా తంటాలు..
తెలంగాణ పల్లెల్లో రైతన్న పరిస్థితి ఆందోళనకరంగా మారుతోంది. పంట పొలాల్లో పచ్చదనం తగ్గి.. నీటి కోసం ఎదురుచూసే దుస్థితి నెలకొంది. సాగునీరు సకాలంలో అందకపోవడంతో పంటలు వాడిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నెలల తరబడి కష్టపడి సాగు చేసిన పంట చివరి దశలో నీటి కొరత బారిన పడటంతో ఏం చేయాలో పాలుపోని పరిస్థితి నెలకొంది. పంటను కాపాడుకునేందుకు రైతులు బోర్లు, బావులు, ఇతర నీటి వనరులపై ఆధారపడుతున్నా.. అవసరమైన స్థాయిలో నీరు అందక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
పంట సాగు ప్రారంభం నుంచి రైతన్న ఎన్నో వ్యయప్రయాసలకు ఓర్చుకుంటున్నాడు. విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు, దుక్కులు, కూలీల ఖర్చులు కలిపి ఇప్పటికే భారీగా పెట్టుబడి పెట్టాడు. పంట చేతికొచ్చే సమయంలో నీరు అందకపోతే చేసిన శ్రమంతా వృథా అవుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. పొలంలోకి వెళ్లి పంట పరిస్థితిని చూసిన ప్రతిసారీ రైతు గుండెల్లో ఆందోళన పెరుగుతోంది. పంటకు అవసరమైన సమయంలో నీరు అందితేనే దిగుబడి ఆశించిన స్థాయిలో వస్తుందని.. లేకపోతే తీవ్ర నష్టం తప్పదని చెబుతున్నారు.
సాగునీటి కోసం రైతులు కాలువలు, చెరువులు, బోర్లు, బావుల వైపు చూస్తున్నారు. కాలువల్లో నీటి ప్రవాహం తగ్గడం, అందుబాటులో ఉన్న నీటిని చివరి ఆయకట్టు వరకు చేరవేయడంలో ఇబ్బందులు ఉండటం వంటి కారణాలతో పలుచోట్ల రైతులు ఇబ్బందులు పడుతున్నారని చెబుతున్నారు. మరోవైపు బోర్లపై ఆధారపడే రైతులకు కూడా పరిస్థితులు అనుకూలంగా లేవు. నీటి మట్టాలు తగ్గితే మోటార్లు పనిచేయడం కూడా కష్టంగా మారుతుందని రైతులు వాపోతున్నారు...“ఇప్పటికే అప్పులు చేసి పంటకు పెట్టుబడి పెట్టాం.. ఇప్పుడు నీళ్లు లేక పంట ఎండిపోతే పరిస్థితి ఏంటి?” అంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంటను కాపాడుకునేందుకు తమవంతు ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ప్రకృతి, నీటి కొరత కలిసి పరీక్ష పెడుతున్నాయని అంటున్నారు. చివరి దశలో పంటకు అందే నీరు ఒక్క తడి అయినా ఎంతో ఉపయోగపడుతుందని.. అందుబాటులో ఉన్న నీటి వనరులను సక్రమంగా వినియోగించి పంటలను కాపాడాలని కోరుతున్నారు...పొలాల్లో పంట పరిస్థితిని అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఎక్కడ నీటి కొరత తీవ్రంగా ఉందో గుర్తించి ఆయా ప్రాంతాలకు ప్రాధాన్య క్రమంలో సాగునీరు అందించాలని కోరుతున్నారు. కాలువల పరిస్థితి, నీటి లభ్యత, పంటల అవసరాలను సమీక్షించి తక్షణ చర్యలు తీసుకోవాలని అంటున్నారు. పంట ఎండిపోయిన తర్వాత పరిహారం కోసం ఎదురుచూడటం కంటే.. ఇప్పుడే నీరు అందించి పంటను కాపాడటమే ప్రభుత్వానికి, అధికార యంత్రాంగానికి ప్రధాన బాధ్యతగా ఉండాలని రైతులు చెబుతున్నారు..రైతుకు పంట అంటే కేవలం పొలంలో పెరుగుతున్న మొక్క కాదు. దాని వెనుక కుటుంబం మొత్తం చేసిన శ్రమ, పెట్టిన పెట్టుబడి, చేసిన అప్పులు, ఎన్నో ఆశలు ఉంటాయి. ఆ పంట కళ్లముందే వాడిపోతుంటే రైతన్న పడే బాధ వర్ణనాతీతం. అందుకే ప్రస్తుతం సాగునీటి కోసం ఎదురుచూస్తున్న రైతన్నకు తక్షణ ఉపశమనం కలిగేలా అధికారులు చర్యలు చేపట్టాలని గ్రామీణ ప్రాంతాల నుంచి డిమాండ్‌ వినిపిస్తోంది. పంట చేతికొచ్చే వరకు రైతుకు అండగా నిలిచి.. అవసరమైన నీటిని అందించి పంటలను కాపాడితేనే రైతన్నకు నిజమైన భరోసా కల్పించినట్లవుతుంది.