Loading Time...
Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

సుదీర్ఘ జీవితాలకు వ్యవస్థల్లో మార్పులు అవసరం

Author
Posted By CHEEKATI VELUGU
| 01 Oct 2026, 06:08 PM | TELANGANA, నల్గొండ
సుదీర్ఘ జీవితాలకు వ్యవస్థల్లో మార్పులు అవసరం

  • వృద్ధుల హక్కుల పరిరక్షణకు చట్టాలు.. నిర్లక్ష్యం చేస్తే న్యాయ సహాయం పొందాలి
  • ఆస్తులు ఇచ్చినా పట్టించుకోకపోతే తిరిగి పొందే అవకాశం

నల్లగొండ, అక్టోబర్‌ 1: పెరుగుతున్న ఆయుర్దాయానికి అనుగుణంగా కుటుంబ, సామాజిక, ఆరోగ్య, సంక్షేమ వ్యవస్థల్లో మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉందని జిల్లా సీనియర్‌ సివిల్‌ జడ్జి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి జి. హిమబిందు అన్నారు. వృద్ధుల హక్కుల పరిరక్షణకు చట్టాలు ఉన్నాయని, వాటిపై అవగాహన పెంచుకోవాలని సూచించారు.

అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం సందర్భంగా నల్లగొండ జిల్లా కలెక్టరేట్‌ సముదాయంలోని ఉదయాదిత్య భవన్‌లో మహిళా, శిశు, వికలాంగుల, వయోవృద్ధుల శాఖ, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ, జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

సుదీర్ఘ జీవితాలకు వ్యవస్థల్లో మార్పులు అవసరం - Additional Image

ఈ సందర్భంగా తల్లిదండ్రులు, వృద్ధ పౌరుల పోషణ, సంక్షేమ చట్టం–2007పై అవగాహన కల్పించారు. 60 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవారిని సీనియర్‌ సిటిజన్లుగా పరిగణిస్తారని తెలిపారు. తమను తాము పోషించుకోలేని పరిస్థితిలో ఉండి, పిల్లలు లేదా బాధ్యత వహించాల్సిన వ్యక్తుల నుంచి సంరక్షణ పొందలేని వృద్ధులు చట్టం కింద నిర్వహణ కోసం దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.

పిల్లలు ఉన్నప్పటికీ తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసినా, ఆర్థికంగా ఆదుకోకపోయినా చట్టపరమైన పరిష్కారం పొందే అవకాశం ఉందన్నారు. అలాగే వృద్ధులు తమ ఆస్తులను పిల్లలు లేదా ఇతరులకు బదిలీ చేసిన తర్వాత వారు సంరక్షణ బాధ్యతలు నిర్వర్తించకపోతే చట్టపరమైన రక్షణ పొందవచ్చని వివరించారు. చట్టంలోని సెక్షన్‌ 23 ప్రకారం, సంరక్షణ బాధ్యతలను షరతుగా పెట్టి ఆస్తి బదిలీ చేసిన సందర్భంలో వాటిని అమలు చేయకుండా వృద్ధులను నిర్లక్ష్యం చేస్తే, ఆ బదిలీని రద్దు చేయాలని కోరవచ్చన్నారు.

ఇవి కూడా చదవండి

ఆస్తులను బదిలీ చేసే ముందు వృద్ధులు న్యాయపరమైన అంశాలను పూర్తిగా తెలుసుకోవాలని సూచించారు. చట్టంలోని సెక్షన్‌ 5 ప్రకారం సంబంధిత ట్రైబ్యునల్‌ను ఆశ్రయించవచ్చన్నారు. దరఖాస్తు, న్యాయ ప్రక్రియపై అవగాహన లేని వృద్ధులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, జిల్లా న్యాయ సేవాధికార సంస్థను సంప్రదిస్తే అర్హతను పరిశీలించి ఉచిత న్యాయ సహాయం అందిస్తామని తెలిపారు. అవసరమైన వారికి ఉచిత న్యాయవాదిని ఏర్పాటు చేసి కేసు పరిష్కారం వరకు సహకరిస్తామని చెప్పారు.

పెద్దలను గౌరవించడం చిన్నప్పటి నుంచే నేర్పాలి

స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ ప్రేమి కరణ్‌రెడ్డి మాట్లాడుతూ వృద్ధులను గౌరవించడం, వారి అనుభవాలను గుర్తించడం ప్రతి కుటుంబం, సమాజం బాధ్యత అన్నారు. చిన్నప్పటి నుంచే పిల్లలకు పెద్దలను గౌరవించడం, క్రమశిక్షణ, కుటుంబ విలువలకు ప్రాధాన్యం ఇచ్చేలా నేర్పించాల్సిన అవసరం ఉందన్నారు.

వృద్ధుల సంక్షేమం కోసం సేవలందిస్తున్న సంఘాలు, స్వచ్ఛంద సంస్థలను గుర్తించి ప్రోత్సహించాలని సూచించారు. ఈ ఏడాది అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం సందర్భంగా ‘దీర్ఘాయువు యుగం: సుదీర్ఘ జీవితాల కోసం వ్యవస్థల పునరాలోచన’ అనే అంశాన్ని ప్రధాన సందేశంగా తీసుకున్నట్లు తెలిపారు.

వృద్ధుల ఆరోగ్యం, సామాజిక భద్రత, గౌరవప్రదమైన జీవనం, హక్కుల పరిరక్షణపై కార్యక్రమంలో అవగాహన కల్పించారు. సెప్టెంబర్‌ 24 నుంచి అక్టోబర్‌ 1 వరకు వయోవృద్ధుల సంక్షేమం–సాధికారత వారోత్సవాలు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. కార్యక్రమంలో సీనియర్‌ సిటిజన్లు నాగిరెడ్డి మల్లికార్జున్‌, దన్నమ్మతో పాటు పలువురు పాల్గొన్నారు.

అత్యధికంగా చదివినవి