Loading Time...
Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

సంక్షేమ హాస్టళ్లకు నిధులు కేటాయించాలి

Author
Posted By CHEEKATI VELUGU
| 02 Oct 2026, 09:07 PM | TELANGANA
సంక్షేమ హాస్టళ్లకు నిధులు కేటాయించాలి

కెవిపిఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు పాలడుగు నాగార్జున

చీకటి వెలుగు, నల్లగొండ, అక్టోబర్ 2:
కుల వివక్షకు వ్యతిరేకంగా, దళితులు, గిరిజనులు, పేదల హక్కుల సాధన కోసం రాబోయే రోజుల్లో జిల్లా వ్యాప్తంగా ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తామని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కెవిపిఎస్) రాష్ట్ర ఉపాధ్యక్షులు పాలడుగు నాగార్జున తెలిపారు. సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడంతోపాటు, వాటికి అవసరమైన నిధులు కేటాయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

కెవిపిఎస్ 29వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం నల్లగొండ జిల్లా కేంద్రంలో సంఘం జెండాను ఆవిష్కరించిన అనంతరం నాగార్జున మాట్లాడారు.

62 రకాల కుల వివక్షలను వెలుగులోకి తెచ్చిన ఉద్యమం

1998 అక్టోబర్ 2న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన పాదయాత్రల ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో కొనసాగుతున్న 62 రకాల కుల వివక్ష రూపాలు వెలుగులోకి వచ్చాయని నాగార్జున తెలిపారు. ఈ వివక్షలకు వ్యతిరేకంగా నిర్వహించిన ఉద్యమాల ఫలితంగా అసెంబ్లీలో చర్చ జరిగిందని, వివిధ సమస్యల పరిష్కారానికి సంబంధించి 106 ప్రభుత్వ ఉత్తర్వులు వెలువడ్డాయని పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ కింద నిధుల కేటాయింపు, దళితుల స్మశాన వాటికలకు భూమి కేటాయింపు తదితర అంశాల్లో కెవిపిఎస్‌ పోరాటాలు కీలక పాత్ర పోషించాయని ఆయన తెలిపారు.

జస్టిస్ పున్నయ్య కమిషన్, కోనేరు రంగారావు కమిటీ సిఫారసుల అమలుతోపాటు దళితులు, గిరిజనులు, పేదల హక్కుల కోసం కెవిపిఎస్‌ నిరంతరం పోరాటాలు నిర్వహిస్తోందన్నారు. అయినప్పటికీ నేటికీ కులం పేరుతో దూషణలు, దాడులు, హత్యలు, కులాంతర వివాహాలు చేసుకున్న వారిపై దాడులు కొనసాగడం ఆందోళనకరమన్నారు. భూమి, గట్టు వంటి వివాదాల్లోనూ దళితులు వివక్షను ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

హాస్టళ్లలో కనీస సౌకర్యాలు కల్పించాలి

సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థులకు మెస్‌ ఛార్జీలు పెంచడంతోపాటు నాణ్యమైన భోజనం అందించాలని నాగార్జున డిమాండ్ చేశారు. విద్యార్థులకు అవసరమైన దుస్తులు, ప్లేట్లు, గ్లాసులు, తాగునీరు తదితర కనీస సౌకర్యాలు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. హాస్టళ్ల నిర్వహణకు సరిపడా నిధులు కేటాయించి విద్యార్థుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో డాక్టర్ గాది లింగస్వామి, లెక్చరర్ కవి లింగమూర్తి, కెవిపిఎస్ జిల్లా ఉపాధ్యక్షులు గాదె నరసింహ, సహాయ కార్యదర్శులు కోడిరెక్క మల్లన్న, బొల్లు రవీంద్రకుమార్, ఒంటెపాక కృష్ణ, డీవైఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి మల్లం మహేష్, ఎస్‌ఎఫ్‌ఐ డివిజన్ కార్యదర్శి కిరణ్‌కుమార్, బొంగురాల వెంకటయ్య, శంకర్, లింగస్వామి, నరేష్, నాగన్న, రాంబాబు, నాగరాజు, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.