చీకటి వెలుగునల్లగొండ
,
ఎల్‌నినో ప్రభావంతో వర్షపాతం లోటు కొనసాగుతున్న నేపథ్యంలో రైతులు వరి సాగు విస్తీర్ణాన్ని గణనీయంగా తగ్గించి పప్పుదినుసులు, నూనెగింజలు, చిరుధాన్యాల వంటి తక్కువ నీటితో సాగయ్యే మెట్ట పంటల వైపు మళ్లాలని వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉపకులపతి అల్దాస్ జానయ్య సూచించారు. నాగార్జునసాగర్, శ్రీరాంసాగర్ ప్రాజెక్టుల నీటిపై ఆశలు పెట్టుకుని కొత్తగా వరి నాట్లు వేయొద్దని స్పష్టం చేశారు. ఇప్పటికే నారు పోసుకున్న రైతులు పరిస్థితిని బట్టి ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలని సూచించారు. నల్లగొండ పట్టణంలోని డైనింగ్ హాల్లో ఆదివారం వ్యవసాయ రంగంపై ఎల్‌నినో ప్రభావం, పంటల మార్పిడి, రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలపై రైతు సంఘం నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో సాధారణ వర్షపాతంతో పోలిస్తే ప్రస్తుతం 10–12 శాతం లోటు ఉందని, ఎనిమిది జిల్లాల్లో ఈ లోటు 30 శాతం వరకు చేరిందని తెలిపారు. ఎల్‌నినో కొత్త పరిణామం కాదు: గత 30 ఏళ్లలో దాదాపు ఆరు ఎల్‌నినో సంవత్సరాలను ఎదుర్కొన్నామని, ఇది కొత్త పరిణామం కాదని జానయ్య పేర్కొన్నారు. ఈసారి సంభవించే నష్టాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు, రైతు సంఘాలు, వ్యవసాయ శాఖ, వ్యవసాయ విశ్వవిద్యాలయం సమన్వయంతో ముందస్తు చర్యలు చేపట్టడం మంచి పరిణామమన్నారు. వర్షాలు తగ్గాయని రైతులు ఆందోళన చెందకుండా పరిస్థితిని అవకాశంగా మలుచుకుని పంటల వైవిధ్యాన్ని పెంచుకోవాలని సూచించారు. వరి విస్తీర్ణం తగ్గించాలి: రాష్ట్రంలో అవసరానికి మించి వరి ఉత్పత్తి జరుగుతోందని, సాగు విస్తీర్ణం కూడా గణనీయంగా పెరిగిందని తెలిపారు. బోర్ల సంఖ్య పెరగడంతో భూగర్భ జలాల వినియోగం అధికమైందన్నారు. ఈ ఏడాది వర్షాలు తగ్గడంతో జలాశయాల్లో నీటి నిల్వలు పడిపోయాయని, భవిష్యత్తులో భూగర్భ జలాలు మరింత తగ్గే ప్రమాదం ఉందని హెచ్చరించారు. వరి సాగుకు అధికంగా నీరు, రసాయన ఎరువులు అవసరమవుతాయని చెప్పారు. నీటి వనరులను కాపాడుకోవాలంటే పంటల మార్పిడి తప్పనిసరన్నారు. నాలుగు ఎకరాల్లో వరి సాగు చేసే రైతు కనీసం రెండు ఎకరాల్లో పప్పుదినుసులు, నూనెగింజలు లేదా ఇతర మెట్ట పంటలు సాగు చేయాలని సూచించారు. సాగర్ నీటిపై ఆశలు వద్దు: నాగార్జునసాగర్‌లో ఈసారి పూర్తి స్థాయిలో నీరు చేరే అవకాశాలు తక్కువగా ఉన్నాయని జానయ్య తెలిపారు. గత రెండు నెలలుగా ప్రభుత్వం, వ్యవసాయ విశ్వవిద్యాలయం, నీటిపారుదల శాఖ రైతులను అప్రమత్తం చేస్తున్నాయని చెప్పారు. ప్రత్యామ్నాయ పంటల విత్తనాలను రైతు వేదికల్లో అందుబాటులో ఉంచడంతో పాటు విత్తన మేళాలు నిర్వహించినట్లు వివరించారు. అయినప్పటికీ సాగర్ నీరు వస్తుందన్న ఆశతో కొందరు రైతులు వరి నారు పోసుకున్నారని తెలిపారు. బావులు, బోర్లు ఉన్న ప్రాంతాల్లో కొంత మేర పంటను కాపాడుకునే అవకాశం ఉన్నప్పటికీ కేవలం సాగర్ నీటిపైనే ఆధారపడిన వరి సాగుకు ప్రస్తుత పరిస్థితులు అనుకూలంగా లేవన్నారు. ఇక కొత్తగా నాట్లు వద్దు: ఇకపై కొత్తగా వరి నాట్లు వేయొద్దని జానయ్య స్పష్టం చేశారు. ఇప్పటికే నారు పోసుకున్న రైతులు వాతావరణం, నీటి లభ్యతను గమనించి నిర్ణయం తీసుకోవాలన్నారు. కేవలం సాగర్ నీటిపై ఆధారపడి నాట్లు వేస్తే చివరి దశలో నీటి కొరతతో తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. వాతావరణ పరిస్థితుల ప్రకారం సెప్టెంబరు వరకు ఇదే తరహా పరిస్థితులు కొనసాగే అవకాశం ఉందన్నారు. హిందూ మహాసముద్ర ద్విధ్రువ స్థితి (ఐఓడీ) సానుకూలంగా మారితే ఎల్‌నినో ప్రభావం కొంత తగ్గి వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు. అయితే అటువంటి వర్షాలు వచ్చినా ప్రస్తుత వానాకాలం వరి పంటకు కాకుండా రెండో పంట లేదా ముందస్తు యాసంగికి ఉపయోగపడే అవకాశమే ఎక్కువగా ఉందన్నారు. ప్రకృతిని మార్చలేం.. ప్రత్యామ్నాయమే మార్గం: సాగర్ నుంచి నీరు రాకపోవడం ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా చేస్తున్నది కాదని, ప్రస్తుత పరిస్థితులు ప్రకృతి ఆధారితమైనవని జానయ్య పేర్కొన్నారు. ప్రకృతి అనుకూలించని సమయంలో పరిస్థితులను అర్థం చేసుకుని రైతులు ప్రత్యామ్నాయ పంటలను ఎంచుకోవాలని సూచించారు. పప్పుదినుసులు, నూనెగింజలు, చిరుధాన్యాలకు ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా నీటి వినియోగాన్ని తగ్గించడంతో పాటు కొంత ఆదాయం పొందే అవకాశం ఉంటుందని తెలిపారు. ఎల్‌నినోను కేవలం సంక్షోభంగా కాకుండా పంటల వైవిధ్యాన్ని పెంచుకునే అవకాశంగా చూడాలని రైతులకు పిలుపునిచ్చారు. వర్షాభావ పరిస్థితులపై రైతులకు అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం, వ్యవసాయ శాఖ, రైతు సంఘాలు, వ్యవసాయ విశ్వవిద్యాలయం మరిన్ని కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. పంటల మార్పిడి తప్పనిసరి: జూలకంటి: ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొంటున్న నేపథ్యంలో రైతులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర చర్యలు చేపట్టాలని అఖిల భారత కిసాన్‌సభ కేంద్ర కమిటీ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి కోరారు. ప్రాజెక్టుల్లో నీటి లభ్యత, వర్షపాతాన్ని అంచనా వేసుకుని తక్కువ నీటితో సాగయ్యే ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహించాలని సూచించారు. నల్లగొండలో రైతు మహాసభ చారిత్రాత్మకం: అఖిల భారత కిసాన్‌సభ 36వ మహాసభను నల్లగొండలో నిర్వహించడం చారిత్రాత్మక నిర్ణయమని జూలకంటి అన్నారు. వీర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి నల్లగొండ కేంద్రంగా నిలిచిందని, వేలాది మంది రైతులు ప్రాణత్యాగాలు చేసిన చారిత్రక ప్రాంతమని గుర్తుచేశారు. ఆ పోరాట ఫలితంగా భూ పంపిణీ, వెట్టిచాకిరీ రద్దు వంటి కీలక మార్పులు చోటుచేసుకున్నాయని తెలిపారు. దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి సుమారు 1,500 మంది రైతు ప్రతినిధులు నాలుగు రోజులపాటు మహాసభలో పాల్గొంటారని చెప్పారు. నవంబరు 15న లక్ష మంది రైతులతో ర్యాలీ: మహాసభను కేవలం ప్రతినిధులతో నిర్వహించి తీర్మానాలు చేసే కార్యక్రమంగా కాకుండా రైతాంగాన్ని పెద్దఎత్తున కదిలించేలా నిర్వహించాలని నిర్ణయించినట్లు జూలకంటి తెలిపారు. నవంబరు 15న లక్ష మంది రైతులతో భారీ ర్యాలీ, బహిరంగ సభ నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఇంటికో వ్యక్తి, గ్రామానికో బస్సు లేదా రెండు ట్రాక్టర్లు తరలించేలా రైతులను సమీకరించాలని పిలుపునిచ్చారు. రాబోయే మూడు నెలల్లో రైతు సంఘం నాయకులు, కార్యకర్తలు గ్రామాల్లో విస్తృతంగా పర్యటించాలని కోరారు. రైతుల సహకారంతోనే మహాసభ నిర్వహించాలన్నది తమ నిర్ణయమన్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో సుమారు 1.30 లక్షల రైతు కుటుంబాలను నేరుగా కలవడంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా మరో రెండు లక్షల కుటుంబాలను సంప్రదించనున్నట్లు తెలిపారు. మహాసభకు అవసరమైన బియ్యం, కూరగాయలు, పప్పులు తదితర సరుకులతో పాటు ఆర్థిక సహకారం అందించాలని రైతులను కోరారు. గిట్టుబాటు ధరకు చట్టం తేవాలి: రైతులు రికార్డు స్థాయిలో పంటలు పండిస్తున్నా గిట్టుబాటు ధర లభించక నష్టపోతున్నారని జూలకంటి ఆవేదన వ్యక్తం చేశారు. పంటకు ధర నిర్ణయించే అధికారం రైతుకు లేకపోవడం ప్రధాన సమస్యగా మారిందన్నారు. పెరుగుతున్న ఉత్పత్తి వ్యయాలు, మార్కెట్ ధరలకు అనుగుణంగా రైతులకు గిట్టుబాటు ధర కల్పించేలా పార్లమెంటులో ప్రత్యేక చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు. కల్తీ విత్తనాలు, ఎరువులు, ఎరువుల కొరత, బ్యాంకు రుణాల సమస్యలు రైతులను తీవ్రంగా వేధిస్తున్నాయని తెలిపారు. రైతుల సమస్యలపై అఖిల భారత కిసాన్‌సభ మహాసభలో విస్తృతంగా చర్చించి భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తామని చెప్పారు. రైతుల సంక్షేమమే దేశాభివృద్ధికి పునాదని జూలకంటి పేర్కొన్నారు. రైతులు సంక్షేమంగా ఉన్నప్పుడే సమాజం అభివృద్ధి చెందుతుందని, వ్యవసాయ రంగం దెబ్బతింటే దాని ప్రభావం మొత్తం ఆర్థిక వ్యవస్థపై పడుతుందని అన్నారు. దేశవ్యాప్తంగా రైతుల సమస్యలపై పోరాటాలు కొనసాగుతున్నాయని, రైతాంగాన్ని ఐక్యంగా కదిలించి హక్కుల సాధనకు ఉద్యమాలను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. నల్లగొండలో తొలిసారిగా నిర్వహిస్తున్న అఖిల భారత రైతు మహాసభను విజయవంతం చేసేందుకు రైతులు, ప్రజా ఉద్యమాల నాయకులు, కార్యకర్తలు సహకరించాలని పిలుపునిచ్చారు. సదస్సులో విశ్రాంత ప్రొఫెసర్ అరిబండి ప్రసాదరావు, తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే నంద్యాల నరసింహారెడ్డి, రాష్ట్ర నాయకుడు బొంతల చంద్రారెడ్డి, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి, వీరపల్లి వెంకటేశ్వర్లు, కందాల ప్రమీల, బండ శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు.
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments