ePaper
Wednesday, July 22, 2026

బీసీలకు రిజర్వేషన్లు కాదు.. రాజ్యాధికారమే లక్ష్యంచట్టసభల్లో ప్రాతినిధ్యం పెరిగితేనే హక్కుల పరిరక్షణ: రాఘవేంద్ర గౌడ్

చీకటి వెలుగు నల్లగొండ.

బీసీలు ఇకపై కేవలం రిజర్వేషన్ల సాధనకే పరిమితం కాకుండా రాజ్యాధికారం కోసం ఉద్యమించాల్సిన సమయం వచ్చిందని బీసీ రాజ్యాధికార వేదిక వ్యవస్థాపక అధ్యక్షుడు ఐతగోని రాఘవేంద్ర గౌడ్ అన్నారు. నల్లగొండ పట్టణంలో సోమవారం నిర్వహించిన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల ఆత్మీయ సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. బీసీలంటే కేవలం వెనుకబడిన తరగతులు, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు మాత్రమే కాదని, అగ్రవర్ణాల్లోని పేదలు కూడా సామాజికంగా వెనుకబడిన వర్గాలేనని పేర్కొన్నారు. బీసీల మధ్య విభేదాలు సృష్టించి వారిని బలహీనపర్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. బీసీలకు చైతన్యం లేదనే ప్రచారాన్ని ఓటు అనే ప్రజాస్వామ్య ఆయుధంతో తిప్పికొట్టాల్సిన అవసరం ఉందన్నారు. ఇప్పటివరకు అనేక రాజకీయ పార్టీలకు, అగ్రవర్ణ నాయకుల ఎదుగుదలకు బీసీలు కీలకంగా పనిచేశారని, ఇకపై బీసీ బిడ్డలే అధికారంలోకి రావాలనే లక్ష్యంతో రాజకీయాలకు అతీతంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రజల సమస్యలనే కార్యాచరణగా తీసుకుని క్షేత్రస్థాయిలో పనిచేస్తేనే ప్రజల విశ్వాసం పొందగలమన్నారు. నాయకులు బయట నుంచి రారని, ప్రజల మధ్య నుంచే ఎదుగుతారని చెప్పారు. ఇటీవల తమిళనాడులో జరిగిన ఎన్నికల్లో రాజకీయ నేపథ్యం లేని సామాన్యులు చట్టసభలకు ఎన్నిక కావడం ఇందుకు నిదర్శనమని వివరించారు. బీసీలకు పెన్షన్లు, రేషన్ కార్డులు ఇవ్వడమే సంక్షేమం కాదని, పాలనా వ్యవస్థలో భాగస్వామ్యం కల్పించడమే నిజమైన సాధికారత అని అన్నారు. స్థానిక పరిశ్రమల్లో బీసీలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తే వారు ఆర్థికంగా ఎదిగి ప్రభుత్వానికి పన్నులు చెల్లించే స్థాయికి చేరుకుంటారని, ఎవరి వద్దా చేయి చాపాల్సిన అవసరం ఉండదని పేర్కొన్నారు. బీసీల జీవన ప్రమాణాలు మెరుగుపడాలన్నా, హక్కులు పరిరక్షించాలన్నా చట్టసభల్లో వారి ప్రాతినిధ్యం పెరగాల్సిందేనని, అందుకు బీసీ రాజ్యాధికారమే ఏకైక మార్గమని రాఘవేంద్ర గౌడ్ స్పష్టం చేశారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు దుడుకు లక్ష్మీనారాయణ, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకుడు పిల్లి రామరాజు యాదవ్, మిరియాల యాదగిరి, కొండూరు సత్యనారాయణ, కొంపెల్లి భిక్షపతి, గోపనబోయిన రమణ ముదిరాజ్, గుండు వెంకటేశ్వర్లు, పెండెం ధనంజయ్, కట్టెల శివ, బోనగిరి సురేందర్, కర్నాటి యాదగిరి, చింతపల్లి శ్రీనివాస్ గౌడ్, వడ్డేపాక యాదయ్య, నజీర్, ఖదీర్, వెంకట్ నరసయ్య, చిలకరాజు చెన్నయ్యతో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు


Discover more from cheekativelugu.com

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments

error: Content is protected !!