చీకటి వెలుగు నల్లగొండ:
రైతుల ఐక్యత, పరస్పర సహకారం, ప్రభుత్వ మద్దతుతో నల్గొండ జిల్లాను బత్తాయి సాగులో దేశానికే ఆదర్శంగా నిలిపేందుకు కృషి చేస్తామని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు.
శనివారం నల్గొండ జిల్లా కేంద్రంలోని ఎలిమినేటి మాధవరెడ్డి ఆడిటోరియంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి సిట్రస్ సెమినార్‌లో ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి మాట్లాడుతూ, నల్గొండ పేరు వినగానే బత్తాయి గుర్తుకొస్తుందని అన్నారు. గతంలో జిల్లాలో 4 లక్షల ఎకరాల్లో బత్తాయి సాగు జరిగేదని, ప్రస్తుతం అది 40 వేల ఎకరాలకు తగ్గిపోవడం బాధాకరమని పేర్కొన్నారు.
రైతులు వరి పంటపైనే ఆధారపడకుండా బత్తాయి వంటి ఉద్యాన పంటల సాగుపై దృష్టి సారించాలని సూచించారు. పంట మార్పిడి అవసరమని, ఈ విషయంలో ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని హామీ ఇచ్చారు. వరి రైతులకు మద్దతు ధరతో పాటు రూ.500 బోనస్ అందిస్తున్నామని గుర్తు చేశారు.
నల్గొండలో బత్తాయి సాగుకు పూర్వవైభవం తీసుకురావడానికి ప్రత్యేక చర్యలు చేపడతామని, అవసరమైతే హైదరాబాద్‌లో మరోసారి సమావేశం నిర్వహించి సిట్రస్ రైతుల సమస్యలు, ఆధునిక సాగు పద్ధతులు, మార్కెటింగ్, ఎగుమతుల అవకాశాలపై చర్చిస్తామని తెలిపారు.
కార్యక్రమంలో పాల్గొన్న రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ, బత్తాయిలో కొత్త రకాల వంగడాలు అందుబాటులోకి వచ్చాయని, అవి రైతులకు ప్రయోజనకరంగా ఉంటాయని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా, రైతు బీమా, మహిళలకు రుణాలు వంటి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నదని తెలిపారు.
ఈ కార్యక్రమంలో రైతు కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డి, నల్గొండ మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర డైరీ డెవలప్మెంట్ చైర్మన్ అమిత్ రెడ్డి, ఉద్యాన విశ్వవిద్యాలయం వైస్‌ఛాన్సలర్ డి. రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
అనంతరం మంత్రి ఆడిటోరియం ఆవరణలో ఏర్పాటు చేసిన వివిధ వ్యవసాయ, ఉద్యాన స్టాళ్లను ప్రారంభించారు.
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments