నల్గొండ పట్టణంలోని 41వ డివిజన్ పరిధిలోని పద్మావతి నగర్ కాలనీ పార్క్‌లో నిర్మించనున్న శ్రీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయానికి రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దేవాలయాల నిర్మాణం ప్రజలను ఐక్యంగా ఉంచి ఆనందకరమైన వాతావరణాన్ని సృష్టిస్తుందని తెలిపారు. కలియుగ దైవంగా ప్రసిద్ధి చెందిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం నిర్మాణం ఎంతో శుభప్రదమని పేర్కొన్నారు. ప్రపంచం నలుమూలల నుంచి భక్తులు దర్శించుకునే స్వామివారి ఆలయం స్థానికంగా నిర్మించుకోవడం ఈ ప్రాంత ప్రజలకు ఆధ్యాత్మికంగా మేలు చేస్తుందన్నారు.
పార్క్ అభివృద్ధి కోసం రూ.70 లక్షలతో పనులు ప్రారంభించామని, ఇప్పటికే అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నాయని తెలిపారు. ఇదే పార్కులో కాలనీవాసులు సుమారు రూ.2 కోట్లతో నిర్మిస్తున్న ఈ దేవాలయానికి తన వంతు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు.
నల్గొండ అభివృద్ధి తన ప్రధాన లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు. మేయర్ ప్రతి వార్డులో తిరుగుతూ పచ్చదనం, చెట్ల పెంపకంపై అవగాహన కల్పిస్తున్నారని ప్రశంసించారు. పట్టణంలోని అన్ని ప్రాంతాల్లో సమగ్ర అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని అన్నారు.
ఈ కార్యక్రమంలో మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి, అదనపు కలెక్టర్ వై. అశోక్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, మాజీ జెడ్పిటిసి గుమ్మల మోహన్ రెడ్డి, కార్పొరేటర్లు వేణుగోపాల్ రెడ్డి, కవిత, కాలనీ అధ్యక్షులు నేతి రఘుపతి, కార్యదర్శి ఆంజనేయులు, ఉపాధ్యక్షులు వెంకటరమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments