కాంగ్రెస్ ప్రభుత్వంపై కంచర్ల భూపాల్‌రెడ్డి ధ్వజం
చీకటి వెలుగునల్లగొండ,
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలను అమలు చేయకుండా అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిందని మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి ఆరోపించారు. ప్రభుత్వ వెయ్యి రోజుల పాలనకు నిరసనగా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో శుక్రవారం నల్లగొండ ప్రభుత్వ జూనియర్ కళాశాల వద్ద వంటావార్పు నిర్వహించారు. మహిళలు, దివ్యాంగులు, వృద్ధులు, విద్యార్థినులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా భూపాల్‌రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రేపు నకిరేకల్‌కు వస్తున్నారని, గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మంజూరైన ఆస్పత్రి ప్రారంభోత్సవానికి హాజరవుతున్నారని అన్నారు. నకిరేకల్‌కు వచ్చే ముందు మహిళలకు నెలకు రూ.2,500, వృద్ధులకు రూ.4,000, దివ్యాంగులకు రూ.6,000, కల్యాణలక్ష్మి కింద తులం బంగారం, రైతులు, కౌలు రైతులకు ఎకరాకు రూ.15 వేల రైతుభరోసా, ఫీజు రీయింబర్స్మెంట్ వంటి హామీలపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. హామీలు అమలు చేయకుంటే ప్రజల నుంచి తీవ్ర నిరసన ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. కేసీఆర్ కిట్, గ్యాస్ సిలిండర్ వంటి పథకాలను కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పక్కనపెట్టిందని విమర్శించారు. కార్యక్రమంలో కంచర్ల కృష్ణారెడ్డి, కటికం సత్తయ్యగౌడ్, మాలే శరణ్యరెడ్డి, రెగట్టే మల్లికార్జున్‌రెడ్డి, మందడి సైదిరెడ్డి, భువనగిరి దేవేందర్ తదితరులు పాల్గొన్నారు.
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments