ePaper
Saturday, September 5, 2026

యూనిఫామ్‌లు, ‘సీఎం కిట్‌’లు వెంటనే ఇవ్వాలి

లేకుంటే కలెక్టరేట్‌ ముట్టడిస్తాం: బీసీ విద్యార్థి సంఘం హెచ్చరిక

చీకటి వెలుగు నల్లగొండ,

ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల సంక్షేమంపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని బీసీ విద్యార్థి సంఘం నల్లగొండ జిల్లా అధ్యక్షుడు అయితగోని జనార్దన్‌గౌడ్‌ ఆరోపించారు. నూతన విద్యా సంవత్సరం ప్రారంభమై మూడు నెలలు గడుస్తున్నా విద్యార్థులకు ఉచిత యూనిఫామ్‌లు అందించకపోవడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమన్నారు. నల్లగొండ జిల్లా కేంద్రంలో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా జాతీయ పండుగ వేడుకలు జరుగుతుండగా.. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు పాత దుస్తులతోనే జెండా వందనానికి హాజరయ్యే పరిస్థితి నెలకొందన్నారు. ప్రభుత్వం యూనిఫామ్‌ రంగులు, నమూనాలు మార్చినట్లు ప్రకటించినా.. కొత్త దుస్తులు మాత్రం పాఠశాలలకు చేరలేదని తెలిపారు. దీంతో విద్యార్థులు, తల్లిదండ్రులు అయోమయానికి గురవుతున్నారని పేర్కొన్నారు.
‘సీఎం కిట్‌’ ఎక్కడ?
ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు తొమ్మిది రకాల నాణ్యమైన వస్తువులతో ‘సీఎం కిట్‌’ అందిస్తామని ప్రకటించినా.. ఇప్పటివరకు వాటి పంపిణీపై స్పష్టత లేదని జనార్దన్‌గౌడ్‌ అన్నారు. విద్యార్థుల అవసరాల కోసం నిధులు కేటాయించకుండా ప్రచారానికే పరిమితం చేయడం సరికాదన్నారు. ప్రభుత్వ విద్యా వ్యవస్థను బలోపేతం చేస్తామని చెబుతూ.. క్షేత్రస్థాయిలో మాత్రం కనీస సౌకర్యాలు, సంక్షేమ పథకాల అమలులో నిర్లక్ష్యం చూపుతున్నారని విమర్శించారు.
ప్రభుత్వం వెంటనే స్పందించి నల్లగొండ జిల్లాతో పాటు రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు నాణ్యమైన యూనిఫామ్‌లు, ‘సీఎం కిట్‌’లను అందించాలని డిమాండ్‌ చేశారు. లేనిపక్షంలో విద్యార్థులు, తల్లిదండ్రులను సమీకరించి నల్లగొండ జిల్లా కలెక్టరేట్‌ ముట్టడితో పాటు విద్యాశాఖ కార్యాలయాల ఎదుట ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. అవసరమైతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు.
కార్యక్రమంలో బీసీ రాజ్యాధికార సమితి జిల్లా అధ్యక్షుడు కర్నాటి యాదగిరి, బీసీ యోజన సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు అనంత నాగరాజుగౌడ్‌, విద్యార్థి సంఘం జిల్లా నాయకుడు కొంపల్లి రామన్నగౌడ్‌, సతీష్‌, నాగరాజు, మహేష్‌, శివ, పృథ్వీరాజ్‌, రవి, తరుణ్‌, రాజు తదితరులు పాల్గొన్నారు.


Discover more from cheekativelugu.com

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments

error: Content is protected !!