ePaper
Saturday, September 5, 2026

భరోసా కేంద్రం బాధితులకు అండగా నిలవాలి

ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆదేశం

చీకటి వెలుగు నల్లగొండ,

మహిళలు, బాలికలు, చిన్నారులపై లైంగిక హింసకు సంబంధించిన ఘటనల్లో బాధితులకు సత్వర న్యాయం అందించడంతోపాటు, వారికి అవసరమైన పోలీస్, వైద్య, న్యాయ, మానసిక సహాయాన్ని ఒకే వేదికపై అందించడంలో భరోసా కేంద్రాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ పేర్కొన్నారు. శుక్రవారం నల్గొండలోని భరోసా కేంద్రాన్ని ఎస్పీ సందర్శించి, బాధితులకు అందుతున్న సేవలను పరిశీలించారు. సిబ్బందితో మాట్లాడి పోలీస్ సహాయం, వైద్య సేవలు, న్యాయ సహకారం, కౌన్సెలింగ్ తదితర అంశాలపై వివరాలు తెలుసుకున్నారు. కౌన్సెలింగ్ గదులు, కేసుల నిర్వహణ, రికార్డుల భద్రపరిచే విధానాన్ని పరిశీలించారు. భరోసా కేంద్రానికి వచ్చే బాధితులకు సత్వర సహాయం అందించడంతోపాటు, అవసరమైన అన్ని రకాల సహకారాన్ని అందించాలని సిబ్బందికి సూచించారు. బాధితులు ఎలాంటి భయాందోళనలకు గురికాకుండా తమ సమస్యలను స్వేచ్ఛగా వెల్లడించేలా నమ్మకమైన వాతావరణాన్ని కల్పించాలని అన్నారు. మహిళలు, బాలికలు, చిన్నారులతో సానుభూతి, గోప్యత, గౌరవంతో వ్యవహరించాలని ఆదేశించారు. బాలలపై లైంగిక నేరాల కేసుల్లో చిన్నారుల మానసిక స్థితిని పరిగణనలోకి తీసుకుని స్నేహపూర్వక విధానంలో విచారణ, కౌన్సెలింగ్, ఇతర సహాయ సేవలు అందించాలని సూచించారు. బాధితులకు త్వరితగతిన న్యాయం జరిగేలా పోలీస్, వైద్య, న్యాయ శాఖలతో సమన్వయంతో పనిచేయాలని తెలిపారు. భరోసా కేంద్రానికి వచ్చే ప్రతి ఫిర్యాదును సున్నితమైన అంశంగా పరిగణించి వెంటనే స్పందించాలని, అవసరమైన సందర్భాల్లో చట్టపరమైన చర్యలు చేపట్టాలని ఎస్పీ సూచించారు. కేసుల పురోగతిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ, బాధితులకు న్యాయం జరిగే వరకు అండగా నిలవాలని స్పష్టం చేశారు. మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతకు జిల్లా పోలీస్ శాఖ అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్న ఎస్పీ, ఎలాంటి ఇబ్బంది ఎదురైనా నిర్భయంగా పోలీసులను ఆశ్రయించాలని సూచించారు. కార్యక్రమంలో మహిళా పోలీస్ స్టేషన్ సీఐ మంజుల, భరోసా కేంద్రం ఇన్‌చార్జి ఎస్‌ఐ అమ్రీన్, ఎస్‌ఐ గౌస్, ఏఎస్‌ఐ అబేదా, శ్రీనివాస్, భరోసా కేంద్రం సమన్వయకర్త నళిని, సిబ్బంది, సంబంధిత పోలీస్ అధికారులు పాల్గొన్నారు.


Discover more from cheekativelugu.com

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments

error: Content is protected !!