ePaper
Monday, June 22, 2026

రాజకీయాల్లో ధనబలం పెరగడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదు

అవినీతికి కఠిన శిక్షలు అమలు చేయాలి.. యువతకు ఉద్యోగాల్లో ప్రాధాన్యం ఇవ్వాలి: మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి

చీకటి వెలుగు ప్రతినిధి, నల్గొండ:

రాజకీయాల్లో పెరుగుతున్న ధనబలం ప్రజాస్వామ్య వ్యవస్థకు మేలు చేసే పరిణామం కాదని తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. అవినీతిని అరికట్టాలంటే కఠిన శిక్షలు అమలు చేయడంతో పాటు వేగవంతమైన విచారణలు జరగాలని సూచించారు. ఆదివారం నల్గొండలోని తన శిబిర కార్యాలయంలో మీడియా ప్రతినిధులతో నిర్వహించిన అనౌపచారిక సమావేశంలో ఆయన సమకాలీన రాజకీయ, పరిపాలనా అంశాలపై తన అభిప్రాయాలను వెల్లడించారు.

ఒకప్పుడు సేవాభావం, సిద్ధాంతాలు, ప్రజా సమస్యల పరిష్కారమే రాజకీయాలకు ప్రధాన బలమని, ప్రస్తుతం భారీ ఆర్థిక వనరులు కలిగిన వ్యాపారవేత్తలు, రియల్ ఎస్టేట్ రంగానికి చెందిన వ్యక్తులు రాజకీయాల్లో ప్రభావం చూపుతున్నారని పేర్కొన్నారు. ఎమ్మెల్యే ఎన్నికల్లో రూ.50 కోట్ల నుంచి రూ.100 కోట్ల వరకు ఖర్చు చేసే పరిస్థితులు ఆందోళనకరమన్నారు.

ఇటీవల దర్యాప్తు సంస్థల దాడుల్లో భారీ మొత్తంలో నగదు, బంగారం, అక్రమ ఆస్తులు బయటపడుతున్నాయని, చిన్నస్థాయి ఉద్యోగుల వద్ద కూడా కోట్ల రూపాయల ఆస్తులు వెలుగుచూడడం అవినీతి తీవ్రతకు నిదర్శనమని అన్నారు. కేసులు నమోదు చేయడం మాత్రమే కాకుండా, తప్పు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటేనే వ్యవస్థలో మార్పు వస్తుందన్నారు.

పదవీ విరమణ చేసిన అధికారులను తిరిగి ప్రభుత్వ సేవల్లోకి తీసుకోవడాన్ని వ్యతిరేకించిన గుత్తా, వేలాది మంది యువత ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో కొత్త నియామకాలకు ప్రాధాన్యం ఇవ్వాలని ప్రభుత్వానికి సూచించారు. ఉద్యోగాల కోసం సంవత్సరాలుగా శ్రమిస్తున్న యువత ఆకాంక్షలను దృష్టిలో పెట్టుకుని విధానాలు రూపొందించాలన్నారు.

రైతు భరోసా పథకం నిజంగా సాగు చేస్తున్న రైతులకే అందేలా ప్రభుత్వం పునరాలోచన చేయాలని, సంక్షేమ పథకాల ప్రయోజనాలు అర్హులైన వారికి పారదర్శకంగా చేరేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

రాజకీయాలు సంపాదనకు మార్గంగా కాకుండా ప్రజాసేవకు వేదికగా మారాలని, డబ్బు, అధికారం, వ్యాపార ప్రయోజనాల కంటే ప్రజల సంక్షేమం, అభివృద్ధి, విలువలకు ప్రాధాన్యం పెరిగినప్పుడే ప్రజాస్వామ్యం మరింత బలపడుతుందని గుత్తా సుఖేందర్ రెడ్డి పేర్కొన్నారు.

మండలి చైర్మన్ చేసిన ఈ వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయ, పరిపాలనా వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.


Discover more from cheekativelugu.com

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments

error: Content is protected !!