ePaper
Sunday, June 21, 2026

యోగతోనే ఆరోగ్యవంతమైన సమాజం సాధ్యం

ప్రతి ఒక్కరూ యోగా, వ్యాయామం, ఫిట్‌నెస్‌కు ప్రాధాన్యత ఇవ్వాలి: జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్

చీకటి వెలుగు ప్రతినిధి, నల్లగొండ:

యోగాను ప్రపంచానికి అందించిన గొప్ప దేశం భారతదేశమని, నేడు ప్రపంచవ్యాప్తంగా యోగా ప్రాముఖ్యతను గుర్తించి అనుసరిస్తున్నారని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ అన్నారు. 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఆదివారం మేకల అభినవ్ స్టేడియంలో పతంజలి సంస్థ, ఆయుష్ శాఖ, జిల్లా క్రీడాశాఖ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని యోగాసనాలు వేశారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతిరోజూ 15 నుంచి 20 నిమిషాల పాటు యోగా చేయడం ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని చెప్పారు. మారుతున్న జీవనశైలి, తగ్గుతున్న శారీరక శ్రమ, ఆహారపు అలవాట్ల కారణంగా అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని పేర్కొంటూ ప్రతి ఒక్కరూ యోగా, వ్యాయామం, ఫిట్‌నెస్‌ను దినచర్యలో భాగం చేసుకోవాలని సూచించారు.

“డబ్బు కంటే ఆరోగ్యమే మహాభాగ్యం” అనే పెద్దల మాటలను గుర్తు చేసిన ఆయన, విద్యార్థులు ప్రతిరోజూ ఆటలతో పాటు యోగా కూడా చేయాలని సూచించారు. ప్రతి పాఠశాల, ప్రతి కాలనీలో యోగా కార్యక్రమాలు నిర్వహించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఆరోగ్యవంతమైన భావి తరాలను తీర్చిదిద్దడంలో యోగా గురువులు కీలక పాత్ర పోషించాలని కోరారు.

కార్యక్రమంలో పతంజలి ప్రతినిధి కర్నాటి విజయకుమార్ యోగా ప్రాముఖ్యతను వివరించగా, యోగా గురువులు, సేవలందించిన పలువురిని జిల్లా కలెక్టర్ సన్మానించారు. అనంతరం అంతర్జాతీయ ఒలింపిక్ డే సందర్భంగా నిర్వహించిన అవగాహన ర్యాలీని జిల్లా కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ రమేష్, అదనపు కలెక్టర్ వై. అశోక్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ హఫీజ్ ఖాన్, జిల్లా వైద్యాధికారి డా. రాహుల్, జిల్లా క్రీడల అధికారి అక్బర్ అలీ, నల్గొండ మున్సిపల్ కమిషనర్ శరత్ చంద్ర, ఆయుష్ శాఖ అధికారులు, పతంజలి ప్రతినిధులు, యోగా గురువులు, విద్యార్థులు, క్రీడాకారులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.


Discover more from cheekativelugu.com

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments

error: Content is protected !!