చీకటి వెలుగు నల్లగొండ,
మిర్యాలగూడ పట్టణంలోని కలాల్వాడలో ఈ నెల 4న జరిగిన త్రిపుల్ మర్డర్ కేసును నల్గొండ జిల్లా పోలీసులు ఛేదించారు. తొలుత ప్రమాదవశాత్తు జరిగిన అగ్నిప్రమాదంగా భావించిన ఘటన వెనుక పథకం ప్రకారం జరిగిన హత్య ఉన్నట్లు దర్యాప్తులో తేలింది.
జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్ ఆదేశాల మేరకు, డీసీఆర్బీ డీఎస్పీ జి. రవి పర్యవేక్షణలో ప్రత్యేక బృందాలు సీసీటీవీ ఫుటేజీలు, సాంకేతిక ఆధారాలు, ఇతర కీలక సమాచారాన్ని విశ్లేషించి నిందితుడు కాళహస్తి శిరీష్ కుమార్ (38)ను అరెస్ట్ చేశాయి.
పోలీసుల వివరాల ప్రకారం, ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం ఊళ్ళపాలెం గ్రామానికి చెందిన శిరీష్ కుమార్ వివాహ వెబ్సైట్ల ద్వారా మహిళలతో పరిచయాలు పెంచుకుని మోసాలకు పాల్పడేవాడు. బాధితురాలు ధనలక్ష్మితో కూడా ఇదే విధంగా పరిచయం ఏర్పరుచుకుని వివాహం చేసుకున్నాడు. అనంతరం ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తడంతో ఆమె అతడిని దూరం పెట్టింది.
ఈ నేపథ్యంలో ధనలక్ష్మిపై కక్ష పెంచుకున్న నిందితుడు ఆమెను, ఆమె పిల్లలను హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు. సంఘటన జరిగిన రోజు దొంగిలించిన స్కూటీపై మిర్యాలగూడకు వచ్చి, పెట్రోల్ కొనుగోలు చేసి రాత్రి సమయంలో బాధితుల ఇంట్లోకి ప్రవేశించాడు. నిద్రిస్తున్న వారిపై పెట్రోల్ చల్లి నిప్పంటించడంతో ధనలక్ష్మి తల్లి వనం చంద్రమ్మ (48), కుమారుడు లక్ష్మణ్ (17), కుమార్తె ప్రణతి (15) సజీవదహనమై మృతి చెందారు. సంఘటన సమయంలో ధనలక్ష్మి ఇంట్లో లేకపోవడంతో ప్రాణాపాయం నుంచి బయటపడింది.
ఘటనాస్థలంలో లభించిన ఆధారాలు, పెట్రోల్ వాసన ఉన్న బకెట్, సీసీటీవీ దృశ్యాలు, ప్రయాణ మార్గ సమాచారం, ఇతర సాంకేతిక ఆధారాల ఆధారంగా పోలీసులు నిందితుడిని గుర్తించి అరెస్ట్ చేశారు. అతడి వద్ద నుంచి స్కూటీ, పెట్రోల్ క్యాన్, బకెట్, పాక్షికంగా కాలిన షర్ట్, హెల్మెట్, సెల్ఫోన్, చెప్పులను స్వాధీనం చేసుకున్నారు.
కేసును వేగంగా ఛేదించిన పోలీసు అధికారులను జిల్లా ఎస్పీ అభినందిస్తూ ప్రశంసాపత్రాలు, నగదు రివార్డులు ప్రకటించారు. అలాగే వివాహ సంబంధాల కోసం ఉపయోగించే ఆన్లైన్ వేదికల ద్వారా పరిచయమయ్యే వ్యక్తుల విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments