ePaper
Saturday, September 5, 2026

*కార్పొరేట్ మాఫియాను అరికట్టి, పాఠశాల విద్యలో సమస్యలు పరిష్కరించాలి:

ABVP నాయకులు రామావత్ సతీష్*
చీకటి వెలుగునల్గొండ, తెలంగాణ రాష్ట్రంలో కార్పొరేట్ విద్యా మాఫియాను అరికట్టి, పాఠశాల విద్యలో నెలకొన్న సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని మహాత్మా గాంధీ యూనివర్సిటీ ABVP నాయకుడు రామావత్ సతీష్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన విడుదల చేసిన ఒక ప్రకటనలో పలు కీలక అంశాలను ప్రస్తావించారు.
ఈ సందర్భంగా రామావత్ సతీష్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడి దాదాపు 12 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ పాఠశాల విద్యా వ్యవస్థ పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారిందని విమర్శించారు. రేషనలైజేషన్ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 9,000 ప్రభుత్వ పాఠశాలలను మూసివేసిందని, వేల సంఖ్యలో ప్రభుత్వ పాఠశాలలు ప్రస్తుతం ఏకోపాధ్యాయ పాఠశాలలుగా కొనసాగుతున్నాయని తెలిపారు.
ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కొరత కారణంగా పేద విద్యార్థులు కూడా ప్రభుత్వ బడుల వైపు చూడలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. ముఖ్యంగా బాలికలకు కనీస మరుగుదొడ్లు కూడా లేక తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కొత్త విద్యా సంవత్సరం ప్రారంభానికి సమయం దగ్గరపడుతున్నప్పటికీ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఇప్పటివరకు యూనిఫార్ములు, పాఠ్యపుస్తకాలు అందించకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని విమర్శించారు.
ప్రభుత్వ పాఠశాలల్లో సరైన పర్యవేక్షణ లేకపోవడంతో మైనర్ విద్యార్థులు మత్తు పదార్థాలకు బానిసలవుతున్న సంఘటనలు చోటుచేసుకుంటున్నాయని తెలిపారు. మరోవైపు ప్రైవేట్ పాఠశాలల్లో అధిక ఫీజుల భారంతో తల్లిదండ్రులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, హైదరాబాద్ మహానగరంలో నర్సరీ విద్యార్థులకే రూ.3 లక్షల నుంచి రూ.4 లక్షల వరకు ఫీజులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. కొన్ని ప్రైవేట్ పాఠశాలలు నిబంధనలకు విరుద్ధంగా ప్రతి సంవత్సరం 30 శాతం వరకు ఫీజులు పెంచుతూ తల్లిదండ్రులను దోపిడీ చేస్తున్నాయని పేర్కొన్నారు.
అదేవిధంగా, DEOలు, MEOలు తగిన పర్యవేక్షణ చేయడంలో విఫలమవుతున్నారని, అనేక మండలాల్లో పూర్తి స్థాయి MEOలు లేక ఇంచార్జ్‌లతోనే వ్యవహారం కొనసాగుతుండటంతో పాఠశాల విద్య దెబ్బతింటోందన్నారు. కస్తూర్బా గాంధీ, గురుకుల పాఠశాలలు సరైన అనుమతులు లేని, శిథిలావస్థలో ఉన్న అద్దె భవనాల్లో నడుస్తున్నాయని, పాము కాట్లు, భవనాల పెచ్చులు ఊడి విద్యార్థులు గాయపడుతున్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
పాఠశాల విద్యలో నెలకొన్న సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని, లేనిపక్షంలో ABVP ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమానికి శ్రీకారం చుడతామని రామావత్ సతీష్ హెచ్చరించారు.


Discover more from cheekativelugu.com

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments

error: Content is protected !!