ePaper
Monday, June 22, 2026

చదువు జీవితాలను మారుస్తుంది: మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

ఇంటర్ విద్యార్థులకు అల్పాహారం, మధ్యాహ్న భోజనం – జూలై 1న డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల ప్రారంభం

చీకటి వెలుగు, నల్లగొండ:

చదువు జీవితాలను మారుస్తుందని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి Komatireddy Venkat Reddy పేర్కొన్నారు. విద్యాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, ఈ విద్యా సంవత్సరం నుంచే రాష్ట్రంలోని 3.5 లక్షల మంది ఇంటర్ విద్యార్థులకు ఉదయం అల్పాహారంతో పాటు మధ్యాహ్న భోజనం అందించనున్నట్లు తెలిపారు.

బుధవారం నల్లగొండ జిల్లా తిప్పర్తి మండల కేంద్రంలో నిర్మాణం పూర్తయిన డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను పరిశీలించిన మంత్రి, జూలై 1 నాటికి అన్ని వసతులతో గృహప్రవేశాలకు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. చిన్నచిన్న మరమ్మతులు ఉన్నా వెంటనే పూర్తి చేసి లబ్ధిదారులకు అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు.

అనంతరం రూ.6 కోట్ల వ్యయంతో నిర్మాణంలో ఉన్న జూనియర్ కళాశాల భవన పనులను పరిశీలించారు. గత ఏడాది తిప్పర్తి, కనగల్ మండలాల్లో ఒక్కోటి రూ.6 కోట్లతో ఆధునిక సౌకర్యాలున్న జూనియర్ కళాశాల భవనాలను మంజూరు చేసినట్లు తెలిపారు. నాణ్యమైన విద్య అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, పనులు వేగంగా కొనసాగుతున్నాయని చెప్పారు.

విద్య ద్వారానే అభివృద్ధి సాధ్యమని పేర్కొన్న మంత్రి, నల్లగొండలో మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయడమే కాకుండా బీ-ఫార్మసీ, లా కోర్సులను కూడా తీసుకువచ్చినట్లు గుర్తుచేశారు. భవిష్యత్తులో ఇంటర్ కళాశాలల్లో కంప్యూటర్ విద్యతో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) విద్యను కూడా అందించనున్నట్లు తెలిపారు.

తిప్పర్తిలో నిర్మించిన 100 డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను జూలై 1న ప్రారంభించనున్నట్లు వెల్లడించిన మంత్రి, తన వ్యక్తిగత సహకారంగా ప్రతి లబ్ధిదారునికి గృహప్రవేశం సందర్భంగా రూ.25 వేల చొప్పున అందజేయనున్నట్లు ప్రకటించారు. అలాగే నల్లగొండ పట్టణంలోని కలెక్టర్ కార్యాలయం వెనుక నిర్మించిన డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల ప్రారంభానికి కూడా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

మహిళల సాధికారత కోసం ప్రతి మండలంలో స్వయం సహాయక సంఘాల ఆధ్వర్యంలో రైస్ మిల్లులు ఏర్పాటు చేసే దిశగా చర్యలు చేపడుతున్నామని, ఇటీవల మహిళా సంఘాలకు రూ.500 కోట్ల వడ్డీ లేని రుణాలను మంజూరు చేసినట్లు వెల్లడించారు.

విద్యార్థులు పదో తరగతి తర్వాత చదువును మధ్యలో ఆపకుండా కొనసాగించాలని మంత్రి సూచించారు. సాంకేతిక విద్య ద్వారా మెరుగైన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని, ఈ లక్ష్యంతో నల్గొండలో న్యాక్, సెట్వి సంస్థలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ B. Chandrashekhar, ఆర్ అండ్ బి ఎస్‌ఈ శ్రీధర్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ జూకూరి రమేష్, సంపత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


Discover more from cheekativelugu.com

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments

error: Content is protected !!