చీకటి వెలుగు నల్గొండ,
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న **“ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక” కార్యక్రమంలో భాగంగా నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో నేడు రెండో విడతగా *డివిజన్ నెంబర్లు 13, 14, 15, 16, 17, 21, 22, 23, 24, 44, 45 మరియు 46*లలో ప్రత్యేక వార్డు సభలు నిర్వహించబడ్డాయి.
ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ బి. శరత్ చంద్ర, స్వయంగా డివిజన్ నెం.15 మరియు 16 లలో నిర్వహించిన వార్డు సభలకు హాజరై ప్రజలతో ప్రత్యక్షంగా సమావేశమయ్యారు. వార్డు స్థాయిలో ప్రజల అవసరాలను గుర్తించి, స్థానిక సమస్యలకు వేగవంతమైన పరిష్కారం చూపడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని ఆయన తెలిపారు.
వార్డు సభలలో సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ రూల్స్–2026 మరియు ఫోర్-వే వేస్ట్ సెగ్రిగేషన్ (నాలుగు రకాల చెత్త వేరు చేయడం) పై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించారు. ప్రతి ఇంటి వద్ద చెత్తను తడి చెత్త, పొడి చెత్త, శానిటరీ చెత్త మరియు ప్రత్యేక సంరక్షణ చెత్తగా వేరు చేసి మున్సిపల్ పారిశుధ్య సిబ్బందికి అందించాలని సూచించారు. చెత్తను మూలం వద్దనే వేరు చేయడం ద్వారా పరిశుభ్రమైన నగర నిర్మాణంతో పాటు వ్యర్థాల శాస్త్రీయ నిర్వహణ సాధ్యమవుతుందని వివరించారు.
అలాగే జల్ సంచయ్ – జల్ భాగీధారి”** కార్యక్రమంలో భాగంగా వర్షపు నీటి సంరక్షణ, ఇంకుడు గుంతల ఏర్పాటు, రూఫ్‌టాప్ రైన్‌వాటర్ హార్వెస్టింగ్ చర్యల ప్రాముఖ్యతను వివరించారు. ప్రతి కుటుంబం వర్షపు నీటి సంరక్షణలో భాగస్వాములు కావాలని, భూగర్భ జలాల పెంపునకు సహకరించాలని పిలుపునిచ్చారు.
రాబోయే వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని నగరంలో చేపడుతున్న డ్రైనేజీల పూడికతీత పనులు, మురుగు కాలువల శుభ్రత, వర్షాకాల సన్నద్ధత చర్యలు గురించి ప్రజలకు వివరించారు. డ్రైనేజీలలో చెత్త వేయకుండా ప్రజలు సహకరించాలని, నీటి ప్రవాహానికి ఆటంకాలు కలగకుండా చూడాలని సూచించారు.
నగరంలో తాగునీటి సరఫరా, పైప్‌లైన్ నిర్వహణ, పారిశుధ్య సేవలు, వీధి దీపాల నిర్వహణ, అంతర్గత రహదారుల అభివృద్ధి, మొక్కల పెంపకం మరియు పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలు నిరంతరంగా చేపడుతున్నట్లు కమిషనర్ తెలిపారు. పచ్చదనం పెంపు ద్వారా ఆరోగ్యకరమైన వాతావరణం ఏర్పడుతుందని పేర్కొన్నారు.
అదేవిధంగా వర్షాకాలంలో నీటి నిల్వలు ఏర్పడకుండా జాగ్రత్తలు తీసుకోవడం, దోమల వ్యాప్తిని నివారించడం, వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం, తాగునీటిని శుద్ధి చేసి వినియోగించడం ద్వారా సీజనల్ వ్యాధులను నివారించవచ్చని ప్రజలకు సూచించారు.
వార్డు సభలలో ప్రజల నుండి తాగునీటి సరఫరా, పారిశుధ్యం, డ్రైనేజీలు, వీధి దీపాలు, రహదారులు, వర్షపు నీటి పారుదల, పార్కుల అభివృద్ధి, ప్రజా సౌకర్యాలు మరియు ఇతర స్థానిక సమస్యలపై వినతులు, ఫిర్యాదులు, సూచనలు స్వీకరించారు. అందిన ప్రజా ఫిర్యాదులను ప్రాధాన్యత క్రమంలో పరిష్కరించేందుకు సంబంధిత అధికారులకు కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు.
ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో నగర ప్రజలు చురుకుగా పాల్గొనాలని, రాబోయే విడతల వార్డు సభలకు కూడా పెద్ద సంఖ్యలో హాజరై తమ అభిప్రాయాలు, సూచనలు తెలియజేయాలని కమిషనర్ పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో 16వ డివిజన్ కార్పొరేటర్ పెరికస్వాతి వినాయక రాజు సంబంధిత డివిజన్ల కార్పొరేటర్లు, వార్డు అధికారులు, మున్సిపల్ అధికారులు, శానిటరీ సిబ్బంది, ప్రజాప్రతినిధులు మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు.
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments