ePaper
Sunday, April 19, 2026

మహిళల సాధికారతకు కాంగ్రెస్ కట్టుబాటు – పున్నా కైలాష్ నేత

నల్గొండ డిసిసి అధ్యక్షులు పున్నా కైలాష్ నేత కాంగ్రెస్ పార్టీ మహిళల పక్షపాతి అని పేర్కొన్నారు. ఆదివారం యాదవ సంఘం భవనంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు.

మహిళల ఆర్థిక, రాజకీయ సమానత్వం కోసం కృషి చేసిన ఏకైక పార్టీ కాంగ్రెస్ అని ఆయన అన్నారు. దేశ తొలి మహిళా ప్రధాని ఇందిరా గాంధీ నాయకత్వంలో భారతదేశం అభివృద్ధి పథంలో ముందుకు సాగిందని గుర్తుచేశారు. అలాగే యూపీఏ చైర్‌పర్సన్ సోనియా గాంధీ ఆధ్వర్యంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల అభివృద్ధి కోసం అనేక సంస్కరణలు అమలు చేశారని కొనియాడారు.

బీజేపీపై విమర్శలు చేస్తూ, 40 సంవత్సరాల చరిత్రలో మహిళలను పార్టీ అధ్యక్షులుగా నియమించారా? జాతీయ పార్లమెంటు కమిటీలలో మహిళలకు ఎంత ప్రాతినిధ్యం కల్పించారని ప్రశ్నించారు. 21 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న బీజేపీలో మహిళల పాత్ర ఎంత ఉందో చెప్పాలని డిమాండ్ చేశారు.

దేశ తొలి మహిళా రాష్ట్రపతి ప్రతిభా పాటిల్‌ను ఆ పదవికి తీసుకువచ్చిన ఘనత కాంగ్రెస్‌కే దక్కుతుందని పేర్కొన్నారు. మహిళా బిల్లు విషయంలో బీజేపీ ఫాసిస్టు విధానాలను అనుసరిస్తోందని విమర్శించారు.

డీలిమిటేషన్ పేరుతో మహిళా బిల్లును ఆలస్యం చేయడం పెద్ద కుట్ర అని అభివర్ణించారు. 2023లో ఆమోదించిన మహిళా బిల్లును ప్రస్తుత పార్లమెంట్, శాసనసభల ప్రాతిపదికన యథాతథంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు.

బీజేపీ సామ్రాజ్యవాద ధోరణితో దక్షిణ భారతదేశం మరియు చిన్న రాష్ట్రాలను దెబ్బతీయాలని ప్రయత్నిస్తోందని ఆరోపించారు. మహిళల పట్ల గౌరవం లేని పార్టీగా బీజేపీ వ్యవహరిస్తోందని, మహిళా బిల్లుపై ఇప్పుడు చూపుతున్న స్పందన కేవలం నాటకం మాత్రమేనని విమర్శించారు.

ఈ కార్యక్రమంలో ఓబీసీ సెల్ చైర్మన్ జిల్లపల్లి పరమేష్‌తో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


Discover more from cheekativelugu.com

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments

error: Content is protected !!