Loading Time...
Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

తెలంగాణ రహదారుల కోసం కేంద్రం వద్ద కోమటిరెడ్డి ప్రతిపాదనలు గడ్కరీతో భేటీ.. డబుల్‌ డెక్కర్‌ కారిడార్‌ నుంచి ఆర్‌ఆర్‌ఆర్‌ వరకు కీలక ప్రాజెక్టులపై విజ్ఞప్తులు

Author
Posted By CHEEKATI VELUGU
| 06 Oct 2026, 05:47 AM | TELANGANA
తెలంగాణ రహదారుల కోసం కేంద్రం వద్ద కోమటిరెడ్డి ప్రతిపాదనలు  గడ్కరీతో భేటీ.. డబుల్‌ డెక్కర్‌ కారిడార్‌ నుంచి ఆర్‌ఆర్‌ఆర్‌ వరకు కీలక ప్రాజెక్టులపై విజ్ఞప్తులు

రహదారి మౌలిక వసతులను మరింత బలోపేతం చేయడంతో పాటు హైదరాబాద్‌ ట్రాఫిక్‌ సమస్యకు పరిష్కారం చూపేలా కీలక ప్రాజెక్టులను వేగవంతం చేయాలని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కేంద్రాన్ని కోరారు. గుజరాత్‌లోని ఏక్తానగర్‌లో జరుగుతున్న ‘చింతన్‌ శివిర్‌–2026’ సందర్భంగా సోమవారం కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీతో ఆయన ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణకు సంబంధించిన పలు జాతీయ రహదారులు, ఎలివేటెడ్‌ కారిడార్లు, రీజినల్‌ రింగ్‌ రోడ్‌ (ఆర్‌ఆర్‌ఆర్‌), గ్రీన్‌ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌వే, రోప్‌వేలు, రహదారి అభివృద్ధి పనులపై రాష్ట్రం తరఫున ప్రతిపాదనలు, విజ్ఞప్తులను కేంద్ర మంత్రి ముందుంచారు.

ఎల్‌బీనగర్‌–హయత్‌నగర్‌ మధ్య సుమారు ఆరు కిలోమీటర్ల మేర ప్రతిపాదించిన డబుల్‌ డెక్కర్‌ ఎలివేటెడ్‌ కారిడార్‌కు 2026–27 వార్షిక ప్రణాళికలో అనుమతి కల్పించి పనులను వేగవంతం చేయాలని కోమటిరెడ్డి కోరారు. ఈ కారిడార్‌ను ప్రతిపాదిత మియాపూర్‌–ఎల్‌బీనగర్‌ మెట్రో విస్తరణతో సమన్వయం చేసే అంశాన్ని కూడా కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. హైదరాబాద్‌ తూర్పు వైపు పెరుగుతున్న రద్దీకి ఈ మార్గం కీలకంగా మారుతున్న నేపథ్యంలో ప్రాజెక్టుకు త్వరితగతిన అనుమతులు లభించాల్సిన అవసరాన్ని వివరించారు.

హైదరాబాద్‌–విజయవాడ–మచిలీపట్నం జాతీయ రహదారి ఎన్‌హెచ్‌–65ను 6+2 లేన్లుగా విస్తరించే పనులను వేగవంతం చేయాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. ఎల్‌బీనగర్‌–మల్కాపూర్‌ సెక్షన్‌లో ఇప్పటికే 6+2 లేన్ల అభివృద్ధికి అనుమతులు ఉన్న నేపథ్యంలో మిగిలిన భాగాన్నీ త్వరగా చేపట్టాలని కోరారు. భారీగా పెరిగిన ట్రాఫిక్‌, ప్రమాదాలకు గురయ్యే ప్రాంతాలు, బ్లాక్‌స్పాట్ల దృష్ట్యా రహదారి సామర్థ్యాన్ని పెంచాల్సిన అవసరాన్ని ఆయన వివరించారు.

రీజినల్‌ రింగ్‌ రోడ్‌ (ఆర్‌ఆర్‌ఆర్‌) విషయంలోనూ కేంద్రం నుంచి త్వరితగతిన నిర్ణయం తీసుకోవాలని కోమటిరెడ్డి కోరారు. సంగారెడ్డి–చౌటుప్పల్‌ మధ్య ప్రతిపాదించిన ఉత్తర భాగానికి ఆర్థిక, కేంద్ర అనుమతులను వేగవంతం చేయడంతో పాటు దక్షిణ భాగాన్ని కూడా ఉత్తర భాగంతో సమాంతరంగా చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. దక్షిణ ఆర్‌ఆర్‌ఆర్‌ భారత్‌ ఫ్యూచర్‌ సిటీ, పారిశ్రామిక క్లస్టర్లు, రేడియల్‌ రోడ్ల అభివృద్ధికి కీలకంగా ఉంటుందని ఆయన కేంద్రానికి వివరించారు.

అదేవిధంగా హైదరాబాద్‌–అమరావతి గ్రీన్‌ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌వేకు సంబంధించిన డీపీఆర్‌ ప్రక్రియను వేగవంతం చేయాలని మంత్రి కోరారు. తెలంగాణలో ప్రతిపాదిత డ్రైపోర్టుతో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని బందరు పోర్టుకు అనుసంధానం కల్పించే అవకాశాలను కూడా పరిశీలించాలని సూచించారు. ఈ మార్గం రెండు రాష్ట్రాల మధ్య సరుకు రవాణా, పారిశ్రామిక అనుసంధానాన్ని మెరుగుపరిచేలా ఉండాలని రాష్ట్రం కోరుతున్నట్లు అధికారులు తెలిపారు.

ఇవి కూడా చదవండి

ఎన్‌హెచ్‌–765పై ఎలివేటెడ్‌ కారిడార్‌ నిర్మాణ ప్రతిపాదనను కూడా మంత్రి కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. హైదరాబాద్‌–శ్రీశైలం మార్గంలోని నల్లమల టైగర్‌ రిజర్వ్‌ ప్రాంతంలో రహదారి అభివృద్ధి చేపట్టే సమయంలో అటవీ, వన్యప్రాణుల పరిరక్షణతో పాటు ప్రయాణికుల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు.

పర్యాటక, ఆధ్యాత్మిక ప్రాంతాలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించే ఉద్దేశంతో పార్వతమాల పథకం కింద ఐదు రోప్‌వే ప్రాజెక్టులకు కేంద్ర అనుమతులు, నిధులు మంజూరు చేయాలని కూడా కోమటిరెడ్డి కోరారు. యాదాద్రి, నల్లగొండ, నాగార్జునసాగర్‌–నాగార్జునకొండ, రామగిరి కోట, నిజామాబాద్‌ ప్రాంతాల్లో ప్రతిపాదించిన ఈ ప్రాజెక్టులకు సుమారు రూ.1,230 కోట్ల వ్యయం అవుతుందని రాష్ట్రం కేంద్రానికి తెలిపింది.

అలాగే CRIF పథకం కింద 2026–27 ఆర్థిక సంవత్సరానికి 33 రహదారి అభివృద్ధి పనులకు రూ.1,227.75 కోట్ల నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ పనులు మొత్తం 511.68 కిలోమీటర్ల మేర చేపట్టనున్నట్లు ప్రతిపాదనలో పేర్కొన్నారు. దీంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో రహదారి అనుసంధానం మెరుగుపడుతుందని ప్రభుత్వం భావిస్తోంది.

సేతు బంధన్‌ పథకం కింద మూడు కీలక ROB/RUBలకు అనుమతులు ఇవ్వాలని కూడా మంత్రి కోరారు. కొత్తగూడెం బైపాస్‌, సుల్తానాబాద్‌, పగిడిపల్లి–నడికుడి రైల్వే సెక్షన్‌లలో ప్రతిపాదించిన పనులను త్వరితగతిన మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.

తెలంగాణలో రహదారి మౌలిక వసతుల అభివృద్ధికి కేంద్ర సహకారం అత్యవసరమని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి గడ్కరీకి వివరించారు. రాష్ట్ర అవసరాలు, పెరుగుతున్న ట్రాఫిక్‌, భవిష్యత్‌ పారిశ్రామిక అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని ప్రాజెక్టులకు త్వరితగతిన అనుమతులు, నిధులు అందించాలని కోరారు. మంత్రి సమర్పించిన ప్రతిపాదనలను పరిశీలిస్తామని నితిన్‌ గడ్కరీ హామీ ఇచ్చినట్లు కోమటిరెడ్డి వెల్లడించారు.