కంది సాయి తేజ,చీకటి వెలుగు: హైదరాబాద్, అక్టోబర్ 31:

మహారాష్ట్ర ఐటీ, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి ఆశిష్ శెలార్ గారు ఈ రోజు తెలంగాణ రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి గారిని డా. బి.ఆర్. అంబేడ్కర్ రాష్ట్ర సెక్రటేరియట్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా సినిమా పరిశ్రమ అభివృద్ధి మరియు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఫిల్మ్ పాలసీ అంశాలపై ఇద్దరు మంత్రుల మధ్య విస్తృత చర్చ జరిగింది.
మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం సినిమా నిర్మాణ రంగం అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించిందని తెలిపారు. రాచకొండ వంటి ప్రాంతాలు సినిమా షూటింగులకు అత్యంత అనుకూలమైనవని, అలాగే ప్రపంచ స్థాయి ప్రమాణాలతో నిర్మించిన రామోజీ ఫిలిం సిటీలో బాలీవుడ్, హాలీవుడ్ స్థాయి సినిమాలు తెరకెక్కుతున్నాయని పేర్కొన్నారు.
అదే విధంగా తెలంగాణ రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాలను కూడా సినిమాల నిర్మాణానికి అనువైన వేదికలుగా తీర్చిదిద్దుతున్నామని, తెలంగాణను హాలీవుడ్ స్థాయి ఫిల్మ్ హబ్‌గా అభివృద్ధి చేస్తున్నామని వివరించారు.
సినిమా పరిశ్రమకు ప్రత్యేక ప్రోత్సాహకాలు, రాయితీలు, సినీ కార్మికుల సంక్షేమ కార్యక్రమాలు అందించడంలో తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తున్నదని మంత్రి తెలిపారు.
మహారాష్ట్ర మంత్రి ఆశిష్ శెలార్ మాట్లాడుతూ, సినిమా పరిశ్రమ అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న చర్యలు అభినందనీయమైనవని, అలాంటి కార్యక్రమాలను మహారాష్ట్రలో కూడా అమలు చేసేందుకు తెలంగాణ పర్యటనకు వచ్చానని తెలిపారు.
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments