ePaper
Saturday, September 5, 2026

బుద్ధవనం జోలికొస్తే సహించేది లేదు

అంబేద్కర్, జగ్జీవన్‌రామ్, గౌతమ బుద్ధ విగ్రహాలను యథాతథంగా ఉంచాలని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు వినతి

చీకటి వెలుగు నల్లగొండ,

పట్టణంలోని మర్రిగూడ బైపాస్‌ రోడ్డులో ఉన్న బుద్ధవనం పరిధిని ఎలాంటి మార్పులు చేయకుండా యథాతథంగా కొనసాగించాలని కోరుతూ దళిత, బహుజనులు, బౌద్ధులు రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ను కోరారు. జాతీయ రహదారి–565 విస్తరణ పేరుతో బుద్ధవనం పరిధిని కుదించడం, అక్కడి డా. బీఆర్‌ అంబేద్కర్, బాబూ జగ్జీవన్‌రామ్, భగవాన్‌ గౌతమ బుద్ధ విగ్రహాలను తొలగించే ప్రయత్నాలను వారు తీవ్రంగా వ్యతిరేకించారు. దళిత, బహుజనుల సుదీర్ఘ పోరాటాల ఫలితంగా బుద్ధవనంలో డా. బీఆర్‌ అంబేద్కర్, బాబూ జగ్జీవన్‌రామ్ విగ్రహాలను ఏర్పాటు చేశారు. 2012లో అప్పటి లోక్‌సభ స్పీకర్‌గా పనిచేసిన బాబూ జగ్జీవన్‌రామ్ కుమార్తె మీరాకుమారి చేతుల మీదుగా ఈ విగ్రహాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి అప్పటి ప్రభుత్వ పెద్దలు, అధికారులు హాజరయ్యారు. అనంతరం బౌద్ధులు, దళిత, బహుజనుల ఆకాంక్షలకు అనుగుణంగా భగవాన్‌ గౌతమ బుద్ధుని విగ్రహాన్ని ఏర్పాటు చేసి, సుమారు రూ.2 కోట్లతో బుద్ధవనాన్ని అభివృద్ధి చేశారు. దీంతో నల్లగొండ ప్రజలకు కుటుంబ సభ్యులు, పిల్లలతో సాయంత్రం వేళల్లో సేదతీరే ఆహ్లాదకర ప్రదేశంగా ఇది మారింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే సందర్శకులు మహనీయుల విగ్రహాల వద్ద ఫొటోలు తీసుకుంటూ తమ విజయాలను పంచుకునే స్థలంగానూ బుద్ధవనం ప్రత్యేక గుర్తింపు పొందింది. ప్రతి ఏటా అంబేద్కర్, జగ్జీవన్‌రామ్ జయంతులు, వర్ధంతులతో పాటు బుద్ధపూర్ణిమ వేడుకలను కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమాలతో బుద్ధవనం నల్లగొండ పట్టణ సాంస్కృతిక, సామాజిక జీవితంలో అంతర్భాగంగా మారిందని వారు పేర్కొన్నారు. అయితే జాతీయ రహదారి–565 నిర్మాణం, రహదారి విస్తరణ పేరుతో బుద్ధవనం పరిధిని తగ్గించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని వారు ఆరోపించారు. వృత్తాకార కూడలిని సుందరీకరిస్తామనే పేరుతో విగ్రహాలను తొలగించడం, ఉద్యానవనం విస్తీర్ణాన్ని కుదించడం తమ మనోభావాలను దెబ్బతీస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. బుద్ధవనం ప్రస్తుత పరిధిలో ఎలాంటి కోత విధించకుండా, అంబేద్కర్, జగ్జీవన్‌రామ్, గౌతమ బుద్ధ విగ్రహాలను తొలగించకుండా యథాస్థానంలో కొనసాగించేలా సంబంధిత అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ను కోరారు. మహనీయుల స్మారక చిహ్నాలను పరిరక్షించడంతో పాటు దళిత, బహుజనులు, బౌద్ధుల మనోభావాలను గౌరవించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు బి. మహేష్ కుమార్, బి శ్రీనివాస్ మాదిగ, పాలడుగు యేసయ్య


Discover more from cheekativelugu.com

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments

error: Content is protected !!