నల్గొండలోని బాలికల ఐటీఐ/ఐటీసీలో నూతనంగా ఏర్పాటు చేసిన ఆరు స్వల్పకాలిక కోర్సులను నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన 99 రోజుల కార్యాచరణ – ప్రజా పాలన & ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఈ కోర్సులను ప్రారంభించారు.
ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ యువత స్వయం ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకుని తమ భవిష్యత్తును నిర్మించుకోవాలని సూచించారు. ప్రభుత్వం చేపట్టిన 99 రోజుల ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక ప్రజల అభివృద్ధి, యువత సాధికారత కోసం ప్రభుత్వ కట్టుబాటును ప్రతిబింబిస్తోందన్నారు.
యువతలో నైపుణ్యాభివృద్ధి పెంపొందించి ఉపాధి అవకాశాలను మెరుగుపరచాలనే లక్ష్యంతో ఈ స్వల్పకాలిక కోర్సులను ప్రారంభించడం అభినందనీయం అన్నారు. పోటీ ప్రపంచంలో విద్యతో పాటు నైపుణ్యాలు కూడా ఎంతో ముఖ్యమని, ఇలాంటి శిక్షణా కార్యక్రమాలు విద్య మరియు ఉపాధి మధ్య ఉన్న అంతరాన్ని తగ్గిస్తాయని తెలిపారు.
ఈ కోర్సుల ద్వారా యువతకు సాంకేతిక పరిజ్ఞానం, ప్రాక్టికల్ నైపుణ్యాలు, ఆత్మవిశ్వాసం పెరిగి ఉద్యోగ అవకాశాలు పొందగలరని లేదా స్వయం ఉపాధి ప్రారంభించగలరని మేయర్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమం ద్వారా మొత్తం 36 వేల మందికి శిక్షణ ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకోవడం గొప్ప విషయమన్నారు.
నేడు ప్రారంభించిన CNC ఆపరేషన్, రోబోటిక్స్ ప్రోగ్రామింగ్, ఎలక్ట్రిక్ వాహనాలు, CAD ప్రొడక్ట్ డిజైన్, CNC మిల్లింగ్, ప్రాసెస్ ఆటోమేషన్ వంటి కోర్సులు ఆధునిక పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా ఉన్నాయని తెలిపారు. కేవలం రెండు వారాల వ్యవధి ఉన్నప్పటికీ ఈ శిక్షణ ద్వారా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై మంచి అవగాహన పొందే అవకాశం ఉంటుందని చెప్పారు.
అదేవిధంగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ ప్రాంత నిరుద్యోగుల కోసం రూ.17 కోట్లతో అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ (ATC) ఏర్పాటు చేయడం యువతకు మరింత ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. నైపుణ్యం కలిగిన యువత అభివృద్ధి చెందడం ద్వారా నల్గొండ జిల్లాలో పరిశ్రమల అభివృద్ధికి, స్థానిక ఆర్థిక వ్యవస్థకు కూడా మద్దతు లభిస్తుందని అన్నారు.
ఈ అవకాశాన్ని పొందిన శిక్షణార్థులు క్రమశిక్షణతో, అంకితభావంతో శిక్షణను నేర్చుకుని తమ భవిష్యత్తును నిర్మించుకోవాలని కోరారు. కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన ప్రభుత్వ ఐటీఐ/ఏటీసీ అధికారులను అభినందిస్తూ, శిక్షణార్థులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
నైపుణ్యవంతమైన, అభివృద్ధి చెందిన తెలంగాణ నిర్మాణంలో యువత ముందుండాలని ఆమె ఆకాంక్షించారు.
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments