ePaper
Tuesday, March 10, 2026

బాలికలకు హెచ్‌పీవీ టీకా కార్యక్రమం ప్రారంభం

నల్గొండ: ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో 14 నుండి 15 సంవత్సరాల లోపు బాలికలకు హెచ్‌పీవీ (HPV) టీకా కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ తెలిపారు. ఆదివారం నల్గొండ ప్రభుత్వ కేంద్ర ఆసుపత్రిలో బాలికలకు హెచ్‌పీవీ టీకా కార్యక్రమాన్ని మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డితో కలిసి ఆయన ప్రారంభించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా మొదటి దశలో సుమారు 21 వేల మంది బాలికలను గుర్తించినట్లు తెలిపారు. అర్హులైన బాలికలకు తల్లిదండ్రుల సమక్షంలో టీకాలు వేయించడం జరుగుతుందని పేర్కొన్నారు. హెచ్‌పీవీ టీకా తీసుకోవడం వల్ల భవిష్యత్తులో వచ్చే సర్వైకల్ క్యాన్సర్ (గర్భాశయ ద్వార క్యాన్సర్) నుండి రక్షణ పొందవచ్చని తెలిపారు.

అర్హులైన బాలికల వివరాలను ఆధార్ కార్డు ఆధారంగా నమోదు చేయడం జరుగుతుందని, టీకా తీసుకున్న వారికి సంబంధిత ధృవపత్రాలు కూడా అందజేస్తామని చెప్పారు. జిల్లావ్యాప్తంగా ఈ కార్యక్రమంపై తల్లిదండ్రులు మరియు బాలికలకు అవగాహన కల్పించాలని ఆరోగ్య శాఖ అధికారులకు సూచించారు.

ప్రభుత్వ ఆసుపత్రులు మరియు పీహెచ్‌సీ కేంద్రాల్లో ఈ టీకాను ఉచితంగా అందిస్తున్నామని, ప్రైవేట్ ఆసుపత్రుల్లో తీసుకుంటే ఖర్చు అవుతుందని తెలిపారు. ఈ టీకా కార్యక్రమాన్ని దశలవారీగా నిర్వహిస్తామని చెప్పారు. అర్హులైన ప్రతి బాలిక ఈ టీకాను తీసుకుని ఆరోగ్యంగా ఉండాలని జిల్లా కలెక్టర్ పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ హెచ్‌పీవీ టీకా తీసుకోవడం వల్ల బాలికలు ఆరోగ్యంగా ఉండటంతో పాటు క్యాన్సర్ వంటి వ్యాధులను నివారించవచ్చని అన్నారు. మహిళలు బలంగా ఉంటే సమాజం కూడా బలంగా ఉంటుందని పేర్కొన్నారు. ముందుజాగ్రత్త చర్యగా ఈ టీకాను తీసుకోవడం ఎంతో మంచిదని చెప్పారు.

ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి పుట్ల శ్రీనివాస్, డిప్యూటీ వైద్యాధికారి వేణుగోపాల్ రెడ్డి, ప్రభుత్వ ఆసుపత్రి డిప్యూటీ సూపరింటెండెంట్ నగేష్, ఆర్‌ఎంఓ మహేష్, మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, 42వ కార్పొరేటర్ నాగలక్ష్మి, 41వ కార్పొరేటర్ వేణుగోపాల్ రెడ్డి, 20వ కార్పొరేటర్ అల్లి సుభాష్, డాక్టర్ పుల్లారావు, డాక్టర్ రమేష్ తదితరులు పాల్గొన్నారు.


Discover more from cheekativelugu.com

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

Recent Comments

error: Content is protected !!