దేశవ్యాప్తంగా చర్చకు దారితీసే కీలక తీర్పును సుప్రీంకోర్టు వెలువరించింది. క్రైస్తవ మతంలోకి మారిన వ్యక్తి షెడ్యూల్డ్ కుల (SC) హోదాను కొనసాగించలేరని స్పష్టం చేసింది.
జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ ఎన్.వి. అంజారియా సభ్యులుగా ఉన్న ధర్మాసనం ఈ తీర్పును ప్రకటించింది. రాజ్యాంగ నిబంధనల ప్రకారం హిందూ, సిక్కు లేదా బౌద్ధ మతాలను అనుసరించే వారికే ఎస్సీ హోదా వర్తిస్తుందని కోర్టు గుర్తుచేసింది.
ఈ కేసు చింతడ ఆనంద్ అనే పాస్టర్‌కు సంబంధించినది. ఆయన క్రైస్తవ మతంలోకి మారిన తర్వాత కూడా ఎస్సీ, ఎస్టీ చట్టం కింద రక్షణ ఇవ్వాలని కోరారు. అయితే ఆయన బహిరంగంగా క్రైస్తవ మతాన్ని అనుసరిస్తున్నట్లు ఆధారాలు ఉన్నాయని పేర్కొంటూ, ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సమర్థించింది.
కోర్టు స్పష్టంగా పేర్కొన్నదేమిటంటే, ఒక వ్యక్తి క్రైస్తవ లేదా ఇస్లాం మతంలోకి మారితే, ఆయా మతాల్లో కుల వివక్ష ఉండదనే భావనతో ఎస్సీ హోదా వర్తించదని రాజ్యాంగం చెబుతోంది. కేవలం ఎస్సీ సర్టిఫికేట్ కలిగి ఉన్నంత మాత్రాన, ఆచరణలో వేరే మతాన్ని అనుసరిస్తే ఆ హోదా చెల్లదని ధర్మాసనం తేల్చిచెప్పింది.
ఈ తీర్పు ప్రకారం, క్రైస్తవ మతంలోకి మారిన వ్యక్తులపై జరిగే దాడుల విషయంలో ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం వర్తించదని కోర్టు స్పష్టం చేసింది. అయితే తిరిగి తమ స్వమతంలోకి వచ్చినట్లు ఆధారాలు ఉంటే మాత్రమే ఎస్సీ హోదా పునరుద్ధరించవచ్చని పేర్కొంది.
ఈ తీర్పుతో దేశవ్యాప్తంగా మత మార్పిడి, రిజర్వేషన్లు, చట్టపరమైన రక్షణలపై పెద్ద ఎత్తున చర్చ మొదలయ్యే అవకాశం ఉందని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments