నల్గొండ జిల్లాలోని వివిధ ప్రభుత్వ డిగ్రీ,పీజీ కళాశాలల, గిరిజన,సాంఘిక సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థులు తీవ్ర సమస్యలను ఎదుర్కొంటున్నారు.విద్యార్థుల ప్రాథమిక అవసరాలైన భోజనం,తాగునీరు,భద్రత,పరిశుభ్రత,గదుల
సౌకర్యాలు, పక్క భవనాలు లేకపోవడం, ఉన్న భవనాలు శిథిలావస్థకు చేరడం వంటి అంశాల్లో నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది.
- నాణ్యత లేని ఆహారం
చాలా హాస్టళ్లలో మెస్‌లో సరైన
నాణ్యత లేని ఆహారం అందుతున్నది.తరచూ పులుసు,దాల్ నీళ్లు పోసినట్టుండటం,కుళ్ళిన కూరగాయలు వాడడం, నాన్-వెజ్ రోజులు కూడా సరిగా పాటించకపోవడం విద్యార్థుల ఆరోగ్యంపై ప్రభావం చూపుతోంది.దీని కారణంగా విద్యార్థులు బలహీనంగా తయారవుతున్న పరిస్థితి ప్రస్తుతం జిల్లాలో నెలకొంది.
- పరిశుభ్రత లేకపోవడం పెద్ద సమస్య
బాత్రూములు, వాష్‌రూములు శుభ్రం చేయకపోవడం,చెత్త సక్రమంగా తొలగించకపోవడం, దోమల సమస్య వంటి అంశాలు హాస్టల్ జీవితాన్ని మరింత కష్టతరం చేస్తున్నాయి. ముఖ్యంగా వర్షాకాలంలో మురుగు నీరు చేరి దుర్వాసన వస్తున్న కారణంగా విద్యాబుద్ధులు నేర్చుకోవాల్సిన విద్యార్థులు ఆసుపత్రులలో పడక గదులకే పరిమితం కావాల్సి వస్తుంది.
- తాగునీరు,వాడుక నీరు
విద్యార్థులపై భారంగా
కొన్ని హాస్టళ్లలో RO ప్లాంట్లు పనిచేయకపోవడం వల్ల విద్యార్థులు బయట నీటిని కొనాల్సి వస్తోంది. రాత్రి వేళల్లో విద్యుత్ అంతరాయాలు పరీక్ష కాలంలో పెద్ద ఇబ్బందిగా మారుతున్నాయి.వాడుక నీరుకు సంబంధించిన ట్యాంకులను నెలలకు వారీగా శుభ్రం చేయకపోవడం వలన రకరకాల చర్మవ్యాధులకు గురవుతున్నారు.
- శిథిలావస్థకు చేరిన భవనాలు, పక్కా భవనాలు లేక అవస్థలు
జిల్లాలోని మారుమూల గ్రామాల నుండి పట్టణ కేంద్రాలకు విచ్చేసి ఉన్నత విద్యను అభ్యసిస్తున్న తరుణంలో కూటికి, గూడుకు లేని పేద,మధ్యతరగతి బడుగు బలహీన వర్గాల విద్యార్థులు ప్రభుత్వ హాస్టల్లో నివసిస్తున్న సందర్భంలో శిథిలావస్థలో ఉన్న భవనాలను చూసి భయభ్రాంతులకు గురవుతున్న పరిస్థితి జిల్లాలో ఏర్పడింది.
- భద్రత సిబ్బంది లోపం విద్యార్థుల భద్రత ప్రశ్నార్థకం
బాలికల హాస్టళ్లలో సరైన భద్రతా సిబ్బంది లేకపోవడం,CC కెమెరాలు పనిచేయకపోవడం వంటి సమస్యలు తల్లిదండ్రుల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. నాన్ బోర్డర్స్ అక్రమంగా హాస్టళ్లలోకి ప్రవేశించి పేద విద్యార్థుల వస్తువులను దొంగలించినప్పటికీ పట్టించుకోని అధికార,భద్రత సిబ్బంది.
ఆవుల సంపత్
మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయ విద్యార్థి.
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments