గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి పోస్టల్ బ్యాలెట్ మరియు ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రాల్లో ఏర్పాట్లను మంగళవారం సమీక్షించారు.
నల్లగొండ మండల పరిషత్ కార్యాలయంలో పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ కోసం చేసిన ఏర్పాట్లను ఆమె పరిశీలించారు. అనంతరం నల్లగొండ మండల కేంద్రంలోని ఇంద్రారెడ్డి ఫంక్షన్ హాల్‌లో ఏర్పాటు చేసిన పోలింగ్ సామాగ్రి డిస్ట్రిబ్యూషన్ సెంటర్‌ను పర్యవేక్షించారు.
పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ అత్యంత బాధ్యతాయుతమైన ప్రక్రియ అని, ఇందులో పాల్గొనే ప్రతీ ఉద్యోగి నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని కలెక్టర్ పేర్కొన్నారు. ఉద్యోగులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా బ్యాలెట్ పంపిణీ, స్వీకరణ సజావుగా జరగాల్సిందిగా ఆదేశించారు. ప్రతి బండిల్‌పై సీల్, సంతకాలు, ధ్రువీకరణ వంటి అంశాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచించారు.
డిస్ట్రిబ్యూషన్ సెంటర్‌లో ఏర్పాటు చేసిన కౌంటర్లు, ఎన్నికల సామగ్రి సరఫరా వ్యవస్థ, రిసెప్షన్ రూమ్ కార్యకలాపాలను కూడా ఆమె పరిశీలించారు. పోలింగ్ బృందాలు వచ్చిన క్రమానుసారం రిజిస్ట్రేషన్ నుంచి మెటీరియల్ పంపిణీ వరకు అన్ని ప్రక్రియలు మార్గదర్శకాలకు అనుగుణంగా సాగాలని అధికారులను ఆదేశించారు. ఎక్కడైనా అయోమయం తలెత్తకుండా సూచిక బోర్డులు, సహాయక కేంద్రాలు ఏర్పాటు చేయాలని సూచించారు.
అదేవిధంగా భద్రతా ఏర్పాట్లు, సీసీ కెమెరా పర్యవేక్షణ, త్రాగునీరు, విశ్రాంతి గదులు, వైద్య అత్యవసర సేవల లభ్యత వంటి అంశాలపై కలెక్టర్ అధికారులు అడిగి తెలుసుకున్నారు.
ఈ పరిశీలనలో జిల్లా పంచాయతీ అధికారి వెంకయ్య, జడ్పీ సీఈఓ శ్రీనివాసరావు, ఆర్టీవో అశోక్ రెడ్డి, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి శేఖర్ రెడ్డి, తహసిల్దార్ పరశురాం, ఎంపీడీవో యాకూబ్ నాయక్ పాల్గొన్నారు.
Discover more from cheekativelugu.com
Subscribe to get the latest posts sent to your email.



Recent Comments